విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్లు, ఢిల్లీ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించారు. గుజరాత్‌తో ఇవాళ (డిషెంబర్ 26) జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విరాట్ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 77 పరుగులు చేయగా.. పంత్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు.
క్లిష్టమైన పిచ్‌పై విరాట్, పంత్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. విరాట్, పంత్ ఔటయ్యాక హర్ష్ త్యాగి (40) కాస్త నిలకడగా ఆడాడు. చివర్లో సిమర్‌జీత్ సింగ్ (15 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.
గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్లు విశాల్ జేస్వాల్ (10-0-42-4), రవి బిష్ణోయ్ (10-0-50-2) ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అర్జన్ నగస్వల్లా, కెప్టెన్ చింతన్ గజా తలో వికెట్ తీశారు. మిగతా ఢిల్లీ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 1, అర్పిత్ రాణా 10, నితీశ్ రాణా 12, ఆయుశ్ బదోని 12, నవ్‌దీప్ సైనీ 6, ఇషాంత్ శర్మ 5 (నాటౌట్) పరుగులు చేయగా.. ప్రిన్స్ యాదవ్ డకౌటయ్యాడు.
3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలు
లిస్ట్-ఏ ఫార్మాట్ అంటేనే పునకాలు తెప్పించే విరాట్ కోహ్లి గత కొంతకాలంలో ఈ ఫార్మాట్‌లో పీక్స్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతని ప్రదర్శనలు చెప్పనశక్యంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. దేశవాలీ స్థాయిలో (VHT 2025-26) సెంచరీ, హాఫ్ సెంచరీతో పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. గత 6 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌ల్లో విరాట్ స్కోర్లు..
- 74*(81)
- 135(120)
- 102(93)
- 65*(45)
- 131(101)
- 77(61)


