ఐసీసీ మహిళ ప్రపంచకప్-2025 విజేతగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన మన అమ్మాయిల జట్టు.. తొలి వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడింది.
స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఈ ప్రతిష్టత్మక ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని యావత్ దేశం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్వయంగా భారత క్రికెటర్లను కలిసి అభినందించారు.
ఈ గెలుపు సంబరాల మధ్య మాజీ భారత కెప్టెన్ శాంత రంగస్వామి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి వైదొలగి బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. దీర్ఘకాలిక భవిష్యత్తు దృష్ట్యా కెప్టెన్సీ మార్పు అనివార్యమని శాంత రంగస్వామి అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
"ప్రతీ ప్రపంచకప్ తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. గత నాలుగైదు ప్రపంచకప్‌లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా ఆర్దమవుతోంది. భారత్ ఓడిపోతే హర్మన్‌ను కెప్టెన్సీ తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గెలిచినా కూడా అదే పాట పడుతున్నారు.
ఇదెక్కడి న్యాయం. ఈ తొలి ప్రపంచకప్ గెలిచిన క్షణాలను అస్వాదిస్తున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకారం. కాబట్టి దీనిపై ఎక్కువగా మాట్లాడాలనుకోవడంలేదు. హర్మన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ఆమె మాతో కలిసి ఆడింది.
అప్పుడే తనలోని టాలెంట్‌ను గమనించాను. అండర్-19 ప్లేయర్‌గా ఉన్నప్పుడే ఆమె భారీ షాట్లు ఆడేది. ఆమె ఒక మ్యాచ్ విన్నర్. అందుకే హర్మన్ కెప్టెన్‌గా కొనసాగాలని నేను చెబుతా ఉంటా అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.
చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?


