భారతదేశంలో డోపింగ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. బహుమతులు అందుకునే దేశాల జాబితాలో ముందుండాల్సిన మన దేశం ఇప్పుడు డోపింగ్ కు పాల్పడుతూ దొరికిపోయిన దేశాల జాబితాలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఎవరో తెలుసా..? ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) The World Anti-Doping Agency.. అవును ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ 2023 పరీక్ష డేటాలో, 5వేలకుపైగా నమూనాలను విశ్లేషించిన దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండడం మనకు అవమానకరమే. అయితే, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ చేసిన అభ్యంతరాలను గుర్తించి వెంటనే ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని, దీని కోసం సవరించిన డోపింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెడతామని భారత క్రీడా మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. నిషేధిత పదార్థాలకు సంబంధించి భారతదేశ సానుకూల రేటు 3.8 శాతం ఉంది. 5,606 నమూనాల్లో 214 ప్రతికూల ఫలితాలు కనుగొన్నారు. 2022లో 3,865 పరీక్షలు నిర్వహించగా 3.2 శాతం ప్రతికూల ఫలితాలు నమోదయ్యాయి.
సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి..
2024లో భారత దేశంలోని అథ్లెట్లు డోపింగ్ సంబంధిత కార్యకలాపాలలో రికార్డు స్థాయిలో 260 మంది పాల్గొన్నారని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అంటే World Anti-Doping Agency (వాడా) వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో భారత అథ్లెట్లు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. డోపింగ్ ఉల్లంఘనలలో భాగంగా తాజా నివేదిక ప్రకారం.. భారతదేశం వరుసగా మూడవసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత దారుణమైన డోపింగ్ అఫెండర్ లిస్ట్ లో చేరింది.
2030లో కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఎడిషన్‌ను నిర్వహించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ కోసం దూకుడుగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. జూలైలో స్విస్ నగరం లౌసాన్‌లోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం ఒలింపిక్ అండ్ పారాలింపిక్ క్రీడలను నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఇంటర్ నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ డోపింగ్ వ్యవహారం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది ఇలా ఉండగా ఢిల్లీ ప్రధాన కార్యాలయం కలిగిన నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ గత సంవత్సరం 7,113 పరీక్షలను నిర్వహించింది, ఇందులో 6,576 మూత్ర నమూనాలు, 537 రక్త నమూనాలు ఉన్నాయి. వీటిలో, 253 మూత్ర నమూనాల్లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు, అయితే ఏడు రక్త నమూనాలు డోప్ పరీక్షలో విఫలమయ్యాయి.
2023లో సేకరించిన 5,606 నమూనాల్లో మొత్తం 213 కేసులు డోప్ పాజిటివ్‌గా వచ్చాయి, తాజా గణాంకాలు యాంటీ డోపింగ్ వాచ్‌డాగ్ మరింత దూకుడు పరీక్షా విధానాన్ని ప్రతిబింబిస్తాయని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ నొక్కి చెప్పింది. అయితే, అనేక ప్రముఖ క్రీడా దేశాలు మరింత విస్తృతమైన పరీక్షలు చేసినప్పటికీ తక్కువ శాతం డోపింగ్ కు గురైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఫ్రాన్స్ 11,744 నమూనాలను పరీక్షించగా, 91 డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలింది. ఇది 0.8 శాతం పాజిటివిటీ రేటు. 2021 వరకు ప్రపంచ డోపింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రష్యా, 10,514 నమూనాల్లో 76 నమూనాలతో 0.7 శాతం రేటును నమోదు చేసింది. చైనా కేవలం 43 డోపింగ్ వైఫల్యాలతో, 24,214 నమూనాల నుంచి అతి తక్కువగా 0.2 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది. అమెరికా డోపింగ్ నిరోధక సంస్థ భారతదేశం కంటే తక్కువ సంఖ్యలో, మొత్తం 6592 పరీక్షలు నిర్వహించి, 1.1 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది.
డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో..?
ఈ నివేదిక భారత క్రీడా సంస్కృతిలో డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో వెల్లడిస్తోంది. అంతేకాదు మన దేశంలో పటిష్టమైన శాస్త్రీయ, పరిశోధన వ్యవస్థ ఉండవలసిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పింది. వివిధ క్రీడా విభాగాల జట్లతో అనుబంధం ఉన్న భారతీయ కోచ్‌లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులకు పనితీరును మెరుగుపరిచే సప్లిమెంట్లు, మందుల వాడకంపై ప్రాథమిక జ్ఞానం లేదని కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిస్థితి ఆందోళన కలిగించేదిగా కనిపిస్తున్నప్పటికీ, డోపింగ్ ప్రాబల్యం పెరిగిందనే భావన సరైనది కాదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ స్పష్టం చేసింది. బలమైన పరీక్షా విధానాలు, కఠినమైన గుర్తింపు యంత్రాంగాలను మరింత పటిష్టం చేయడం వల్లే ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయని నాడా ఒక ప్రకటనలో పేర్కొంది. అధిక పాజిటివిటీ రేటు కొనసాగడానికి ఇదే ప్రధాన కారణమని వివరించింది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ.
2025లో ఇప్పటివరకు నాడా మొత్తం 7,068 డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 110 మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో పాజిటివిటీ రేటు 1.5 శాతంగా నమోదైందని తెలిపింది. డోపింగ్ ముప్పును ఎదుర్కొనే దిశగా భారత ఒలింపిక్ సంఘం తాజాగా కొత్త డోపింగ్ నిరోధక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో క్రీడల్లో అత్యున్నత స్థాయి సమగ్రతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ డోపింగ్ నిరోధక బిల్లును కూడా ఆమోదించడం గమనార్హం.
కల్తీ సప్లిమెంట్ల సమస్యను పరిష్కరించడానికి, నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికైనా తగిన పరిష్కారాల ద్వారా ఇండియా అథ్లెట్స్ మరొకసారి నిషిద్ధ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని మన దేశ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-పసుపులేటి.వెంకటేశ్వరరావు.


