ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సహజ, రష్మిక | Sahaja and Rashmika in the pre quarter finals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సహజ, రష్మిక

Feb 11 2026 3:45 AM | Updated on Feb 11 2026 3:45 AM

Sahaja and Rashmika in the pre quarter finals

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ సహజ యామలపల్లి, రెండో ర్యాంకర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేశారు. పుణేలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తెలంగాణ అమ్మాయి సహజ 6–4, 7–6 (8/6)తో ఎకతెరీనా మక్లాకోవా (రష్యా)పై, హైదరాబాద్‌ ప్లేయర్‌ రష్మిక 6–3, 6–2తో విక్టోరియా మిలోవనోవా (రష్యా)పై విజయం సాధించారు. 

మక్లాకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సహజ నాలుగు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన తొలి సర్వీస్‌లో 31 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 14 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 

మిలోవనోవాతో 86 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రష్మిక తొమ్మిది ఏస్‌లు సంధించింది. తొలి సర్వీస్‌లో 32 పాయింట్లు, రెండో సర్వీస్‌లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.  

టాప్‌ సీడ్‌ జోడీని ఓడించి... 
డబుల్స్‌ విభాగంలో సహజ (భారత్‌)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్‌) జోడీ సంచలన విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో సహజ–జుజానా ద్వయం 4–6, 7–6 (7/4), 11–9తో టాప్‌ సీడ్‌ ప్రార్థన తొంబారే (భారత్‌)–నికోల్‌ ఫోసా హ్యుర్గో (అర్జెంటీనా) జంటను బోల్తా కొట్టించింది. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని–ఆకాంక్ష (భారత్‌) జోడీ 4–6, 3–6తో డేయోన్‌ బ్యాక్‌–సోహున్‌ పార్క్‌ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement