విష్ణువర్ధన్‌ ఖాతాలో 48వ డబుల్స్‌ టైటిల్‌ | Vishnuvardhan wins his 48th doubles title | Sakshi
Sakshi News home page

విష్ణువర్ధన్‌ ఖాతాలో 48వ డబుల్స్‌ టైటిల్‌

Feb 2 2026 2:24 AM | Updated on Feb 2 2026 2:24 AM

Vishnuvardhan wins his 48th doubles title

సాక్షి, హైదరాబాద్‌: భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, లండన్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ తన కెరీర్‌లో 48వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఎం15 టోర్నీలో తెలంగాణకే చెందిన గంటా సాయికార్తీక్‌ రెడ్డితో కలిసి విష్ణువర్ధన్‌ డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

25 ఏళ్ల సాయికార్తీక్‌ రెడ్డికిది 11వ డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. డబుల్స్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌–సాయికార్తీక్‌ ద్వయం 6–1, 6–4తో ఇషాక్‌ ఇక్బాల్‌–దేవ్‌ జావియా (భారత్‌) జంటపై గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు–సాయికార్తీక్‌ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తొలి సర్వీస్‌లో 23 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 9 పాయింట్లు స్కోరు చేశారు. 

తమ సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థుల సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశారు. తొలి రౌండ్‌లో విష్ణు–సాయికార్తీక్‌ 6–3, 6–4తో నైషిక్‌ రెడ్డి గణగామ–మాచెర్ల తీర్థ శశాంక్‌ (భారత్‌)లపై, క్వార్టర్‌ ఫైనల్లో 6–3, 7–5తో అర్జున్‌–కహీర్‌ (భారత్‌)లపై, సెమీఫైనల్లో 5–7, 7–6 (7/4), 10–8తో ఆదిత్య–అథర్వ (భారత్‌)లపై విజయం సాధించారు. 

38 ఏళ్ల విష్ణు వేర్వేరు భాగస్వాములతో కలిసి 2008లో 1... 2009లో 6... 2010లో 3 ... 2011లో 5... 2012లో 1... 2013లో 1... 2014లో 3... 2015లో 4... 2016లో 5... 2017లో 10... 2018లో 2... 2021లో 1... 2023లో 3... 2024లో 2... 2026లో 1 డబుల్స్‌ టైటిల్‌ గెలిచాడు.   

Advertisement
 
Advertisement
Advertisement