
‘నాడా’ సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పతకాలెన్నో సాధించిన ట్రిపుల్ జంపర్ షీనా వార్కే డోపింగ్‌లో దొరికిపోయింది. ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. కేరళకు చెందిన 32 ఏళ్ల షీనా ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల్లోనూ రజత పతకంతో మెరిసింది. ఫెడరేషన్ కప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్ (2018)లో రజతం గెలిచింది.
రెండేళ్ల క్రితం హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కూడా ఆమె పోటీపడింది. డోపింగ్‌లో పట్టుబడిన షీనాను సస్పెండ్ చేస్తున్నట్లు ‘నాడా’ వర్గాలు తెలిపాయి. అయితే ఆమె తీసుకున్న ఉత్ప్రేరకాలెంటో నాడా బహిర్గతపరచలేదు. డోపింగ్ పాజిటివ్ ఫలితాల రేటింగ్‌లో భారత్ 3.8 శాతంతో చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాల కంటే ముందువరుసలో నిలవడం భారత క్రీడల ప్రతిష్టను మసకబారుస్తోంది. ఒక్క అథ్లెటిక్స్‌లోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) జరిపిన పరీక్షల్లో 1223 పాజిటివ్ కేసులుంటే ఇందులో 61 మంది భారత అథ్లెట్లు ఉండటం క్రీడావర్గాలను కలవరపెడుతోంది.