
సాక్షి, హైదరాబాద్: కవిత సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. కవిత సస్పెన్షన్ బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారంగా ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం.. ఆ అవినీతి సొమ్ము పంపకంలో తేడాలు వచ్చాయి. అందుకే ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై కవిత మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే విషయం బీజేపీ చెబితే రాజకీయం అంటారు’’ అని రామచందర్‌రావు పేర్కొన్నారు.
అవినీతి డైవర్షన్.. కవిత సస్పెన్షన్: డీకే అరుణ
కవిత సస్పెన్షన్‌ను కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీగా ఎంపీ డీకే అరుణ అభివర్ణించారు. ఆ కుటుంబంలో అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కవిత ఏకంగా జైలుకే వెళ్లి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి డైవర్షన్‌లో భాగంగానే కవిత సస్పెన్షన్. బీఆర్‌స్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి’’ అంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు.
కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు: హరీష్‌బాబు
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ.. కవితపై వేటు పూర్తిగా కుటుంబ వ్యవహారమన్నారు. ‘‘కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడుతున్నాయి. కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. కాళేశ్వరం అవినీతిలో ఇద్దరి పాత్ర ఉందని కవిత చెప్పారు. సీబీఐకి కవిత పూర్తి వివరాలు అందించాలి’’ అని హరీష్‌బాబు పేర్కొన్నారు.