
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కారణంగా బంద్ కొనసాగుతోంది. బంద్‌లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొంటున్నారు. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండాపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం. కానీ, బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లని జీవోలను, ఆర్డినెన్స్‌ను విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు.
మాజీమంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గవద్దు అంటూ కామెంట్స్ చేశారు.