
కాంట్రాక్టులు, వాటాలు, వసూళ్లు, కబ్జాలు, పోస్టింగుల కోసం పోటీ
అక్రమాలపై జ్యుడీషియల్ విచారణ జరగాలి: మాజీమంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం.. దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని..కేబినెట్ మీటింగ్‌లో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కమీ షన్లు, కాంట్రాక్టులు, వసూళ్లు, వాటాలు, కబ్జాలు, పోస్టింగుల కోసం పోటీలు పడుతూ పాలన గాలికి వదిలి వ్యక్తిగత పంచాయితీలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్య మంత్రి, మంత్రులు పరస్పరం తిట్లతో గడుపుతున్నారని, అతుకుల బొంత ప్రభుత్వ మనుగడపై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు, పార్టీ నేతలు చిరుమర్తి లింగయ్య, పల్లె రవికుమార్‌తో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశం ద్వారా తీపి కబురు చెప్తారని ఆశించిన అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారన్నారు.
రేవంత్ ‘గన్ కల్చర్’ తెచ్చారు
‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వ్యాపార వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పెట్టుబడులతోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేశాం. కానీ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోకి గన్ కల్చర్ తెచ్చి వ్యాపారవేత్తలను తుపాకులతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పెడుతున్నారని, సీఎం జపాన్ నుంచి ఫైళ్లు ఆపించారని ఓ మంత్రి కుమార్తె స్పష్టంగా చెప్తోంది.
కాంట్రాక్టుల కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా హీరోలు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఇక్కడ జరుగు తున్న అరాచకాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లేదా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ జరిపించాలి. సీఎం తుపాకీ పంపారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ స్పందించాలి’అని హరీశ్‌రావు అన్నారు.
దేని కోసం విజయోత్సవాలు..?
‘ప్రభుత్వ సంస్థలను అప్పుల కుప్ప చేసి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి అప్పులు తెచ్చారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు హ్యామ్ మోడల్ పేరిట రూ.10,547 కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోవడంతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్ ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. 23 నెలల పాలనలో అన్ని పథకాలు, హామీలను అమలు చేయకుండా డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు జరపాలని నిర్ణయించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పెరిగిన అరాచకాలపై విచారణ ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు.