
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఇంటి పోలీసులు వెళ్లడంపై బుధవారం రాత్రి హైడ్రామా నెలకొంది. ఈ సందర్బంగా పోలీసులు, డెక్కన్ సిమెంట్, రోహిన్ రెడ్డిపై(Congress DCC Rohin Reddy) కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత(Konda Sushmitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌పై తాజాగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు.
కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నాపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. డెక్కన్ సిమెంట్స్ అంశం చెప్తే నేను ఇలాంటి వాటిలో వేలు పెట్టను అని సుమంత్‌కి ముందే చెప్పి పంపేశాను. నేను ఎలాంటి అసాంఘిక పనుల్లో తల దూర్చను.. ఈ విషయంలో నా ప్రమేయం లేదు’ అని చెప్పుకొచ్చారు.
సుస్మిత ఆరోపణలు..
ఇక, అంతకుముందు.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత మాట్లాడుతూ.. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్‌తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగాను. ఆధారాలు అడిగితే వరంగల్ నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని అన్నారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ కామెంట్స్ చేశారు.
బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుస్మిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్‌మెన్‌లు ఎందుకని ఆమె ప్రశ్నించారు.