
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.
కాగా, హైదరాబాద్‌లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం(అక్టోబర్ 15) కూడా దాదాపు 10 గంటల పాటు హల్‌చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించారు. ఇక ఎస్సీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కూడా ఆదివారం(అక్టోబర్ 12) తెల్లవారుజామున పోలీసుల దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే.

టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది.