ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు | Remand report on former mla pilot rohith reddy farm house case | Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Mar 16 2026 1:55 PM | Updated on Mar 16 2026 2:16 PM

Remand report on former mla pilot rohith reddy farm house case

సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర డ్రగ్స్‌తో పాటు మందు పార్టీ జరిగింది. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లగానే మొదట బుల్లెట్‌ సౌండ్‌ వినపడింది. బుల్లెట్‌ సౌండ్‌ విని వెంటనే అప్రమత్తమయ్యాం. మేం పోలీసులం కాల్చవద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచాం. మేము చెప్తున్నప్పటికీ కూడా.. పట్టించుకోలేదు. మరో రెండుసార్లు బుల్లెట్‌ సౌండ్‌ వినపడింది. 
 
మరోవైపు మీరు కాల్పులు జరపండి.. నేను మొత్తం చూసుకుంటా.. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా అరిచేసరికి ఫైరింగ్‌ సౌండ్‌ నిలిచిపోయింది. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్‌ పూల్‌ వద్దకు చేరుకున్నాం. ఫామ్‌హౌస్‌ సెర్చ్‌ చేసేందుకు మేము వారెంట్‌ తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన వెంటనే.. సెర్చ్‌ వారెంట్లను రోహిత్‌రెడ్డికి ఇచ్చాం. బాత్రూం దగ్గర ఉన్న నమిత్‌ శర్మ చేతిలో.. తుపాకీని మేం స్వాధీనం చేసుకున్నాం.

బుల్లెట్‌ షెల్స్‌ పట్టుకొని మరొకరున్నారు. అతనిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లో ఓ మహిళతో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మన్‌ మేడ్‌ రివాల్వర్‌ పాయింట్‌ 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని విడివిడిగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్‌ తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదేపదే విచారించడంతో చివరికి శరత్‌కుమార్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిని చెక్‌ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్‌ బయటపడింది. కొకైన్‌ ఎవరు తెచ్చారనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు.

పైలెట్‌ రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ను విచారించినప్పుడు కొకైన్‌ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. కొకైన్‌ తానే తెచ్చానని కౌషిక్‌ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లినప్పుడు తానే కొకైన్‌ తీసుకొని వచ్చానని చెప్పాడు.’అని తెలిపారు.  

నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుండగా ఈగల్‌ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్‌తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement