
హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పని లేకుండా ఉపయోగించకుండా రికార్డ్ స్థాయిలో పంటలు పండించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు ఉత్తమ్. ఈరోజు(శనివారం, అక్టోబర్ 11వ తేదీ) హనుమకొండలో ప్రెస్‌మీట్ నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, సీతక్కలు.
దీనిలోభాగంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘ బనకచర్ల విషయంలో హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోదావరి, కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాము. బనకచర్ల ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వ్యతిరేకం. హరీష్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వంతో కోట్లాడుతున్నాము.
కృష్ణనది జలాల విషయంలో కేంద్ర జలశక్తి ముందు వాదనలు వినిపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. బీఆర్‌ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కాళేశ్వరం ద్వారా ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. తుమ్మడిహట్టి వద్ద 10 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదు.
సీతారామ ప్రాజెక్ట్ మా హయంలో పూర్తి చేసినం. సమ్మక్క, సారలమ్మ ప్రాజెక్ట్ విషయంలో అన్ని అనుమతులు సాధిస్తున్నాం. హరీష్ ఇచ్చే స్టేట్ మెంట్లలో వాస్తవాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ పూర్తిచేసి టెండర్లు పిలిస్తే మనకేమి సంబంధం. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని ప్యతిరేకిస్తాం’ అని ఉత్తమ్ తెలిపారు.