
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని ఆరోపించారు. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్(CM Revanth Reddy) ఒక మాట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట మాట్లాడుతున్నారు. పూట పూటకో మాట.. ఘడియ ఘడియకో లెక్క అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. కృష్ణా జలాల్లో 299 టీఎంసీ వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్(Congress Party) పార్టీనే. చారిత్రక తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బీఆర్ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్. ఒకవైపు చంద్రబాబుకు(Chandrababu) భయపడి బనకచర్లపై మౌనం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తుపై సైలెంట్. రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా?. కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు. ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు. బేసిన్ల గురించి బేసిక్స్ తెలియదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి వ్యక్తులు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు. రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నారు.. కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్‌ఓసీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అన్నాడు. మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమన్నారు?. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటున్నారు. మంత్రి ఉత్తమ్ ఏమో 763 టీఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నారు.
హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు
కృష్ణా జలాల వాటా పై సీఎం @revanth_anumula ఒక మాట, మంత్రి @UttamINC మరో మాట
పూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క
299 tmc కృష్ణ జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే
చారిత్రక తప్పిదం చేసింది మీరు,… pic.twitter.com/e2K8XpOElj— Harish Rao Thanneeru (@BRSHarish) September 24, 2025
వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు?. కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు. కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్-3 కోసం పోరాటం చేశారు. ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధానిలను కలిశారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్-3 సాధించారు. 763 టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయం. ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు.. ఉత్తమ్ డబ్బా కొడుతున్నాడు.
అదనపు టీఓఆర్ ప్రకారం, మేము కృష్ణా జలాల్లో మొత్తం 935 టీఎంసీల వాటా సాధించేందుకు గ్రౌండ్ తయారు చేశాం. 811 టీఎంసీలు, 195 సర్ ప్లస్ వాటర్ షేర్, 45 టీఎంసీల పోలవరం వాటర్. ఇప్పుడు వీళ్లు ఏం అంటున్నారు 904 టీఎంసీలే మా న్యాయమైన వాటా అంటున్నారు. ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టి లేదు. ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు. 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది. తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది. 299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్