సాక్షి, హైదరాబాద్: నగరంలోని నల్లకుంట పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి ఆమెకు నిప్పంటించాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన తన బిడ్డను కూడా మంటల్లో తోసే ప్రయత్నం చేయగా.. అతి కష్టం మీద ఆమె బయట పడింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చెందిన వెంకటేశ్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం, ఉద్యోగ రీత్యా వీరిద్దరూ హైదరాబాద్‌కు వచ్చారు. నల్లకుంట వద్ద ఉన్న తిలక్‌నగర్ బస్తీలో రెంటుకు ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్ సెంట్రింగ్ పనిచేస్తుండగా.. త్రివేణి ఒక హోటల్‌లో పనిచేస్తుంది. అయితే,
త్రివేణి హోటల్ నుంచి ఇంటికి ఏ కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఆమెను అనుమానంతో వెంకటేశ్ వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక కొద్దిరోజుల క్రితం త్రివేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తాను మారతానని నమ్మబలికి త్రివేణిని వెంకటేశ్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. తీరా.. హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంకటేశ్ మళ్లీ మొదటికొచ్చాడు. ఇద్దరి మధ్య కలహాలు పెరగడంతో ఆగ్రహానికి లోనైన వెంకటేశ్.. త్రివేణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భార్య త్రివేణి, కొడుకు ఇద్దరు ఒకే మంచంపై నిద్రపోతుండగా.. కూతురు కింద పడుకుని ఉంది. ఆ సమయంలో మంచంపై నిద్రపోతున్న భార్య త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఇంతలో వెంకటేశ్‌ను కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెకు కూడా మంటల్లోకి తీసే ప్రయత్నం చేశాడు. వెంకటేశ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఎలాగోలా పాప తప్పించుకుంది. ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేయగలిగారు.

కాగా, పాప ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. త్రివేణి అప్పటికే చనిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని త్రివేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అప్పలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


