తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు ఆర్‌ఆర్‌ఎస్ రంగంలోకి దిగింది. నేడు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మరోవైపు, గురువారం హైదరాబాద్‌లో బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) కార్యాలయాన్ని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలె ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు బీఎంస్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.
కాగా, తెలంగాణలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుల పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. నగర శివారులోని కన్హా శాంతి వనంలో విశ్వ సేవక్ సంఘ్ శిబిరం గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఈ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. అయితే, తెలంగాణపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖుల పర్యటనలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, బీజేపీ బలోపేతంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖల పెంపు, కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. 2025లో 392 కొత్త శాఖలను ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 3800 శాఖలు ఉండగా.. 2026 నాటికి 4000 శాఖల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ‘భాగ్యనగర్’ వంటి పేర్లతో సాంస్కృతిక పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక రంగంలో ఒక ముఖ్యమైన అంశంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీఎంఎస్ ప్రారంభం..
సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలె గురువారం హైదరాబాద్‌లో బీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎంఎస్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా అభివర్ణించారు. ఇక, ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధంగా కార్మిక రంగంలో ప్రత్యేక శక్తిగా బీఎంఎస్ ఎదుగుతోంది. బీఎంఎస్.. కార్మికుల హక్కులు, జాతీయ ప్రయోజనం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. ఇది కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తుంది. కార్మికులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తోంది. కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతపై ఫోకస్ చేస్తుంది.
అలాగే, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతుగా స్వదేశీ జాగరణ కార్యక్రమాలు చేపట్టింది. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో బీఎంస్‌కు రాజకీయ, సామాజిక స్థాయిలో విస్తృత ప్రభావం ఉంది. దీంతో, తెలంగాణ కార్మిక సంఘాల విషయంలో బీఎంస్ కొత్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ బలోపేతంగా దిశగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నట్టు పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


