సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడను అని.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు కుండబద్దలు కొట్టారు. అదే తన బ్రాండ్ ఇమేజ్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దానం హాట్ టాపిక్‌గా మారారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. నేను ఏ విషయమైనా డైరెక్ట్‌గానే చెబుతాను. ఎవరికీ భయపడే రకం కాదు. నేను కాంగ్రెస్ ఉన్నానని ధైర్యంగా చెబుతున్నాను. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం శ్రమిస్తాను. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజన శాస్త్రీయబద్దంగా జరిగింది. దేశంలో హైదరాబాద్ నెంబర్-1గా ఉండటానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. హైడ్రా నా సలహాలు పరిగణనలోకి తీసుకుంది. అందుకే పేద, మధ్య తరగతి ఇళ్ల జోలికి వెళ్లడం లేదు అని చెప్పుకొచ్చారు.
ఇక, అంతకుముందు కూడా దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా. నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది.. అదీ నా స్పెషాలిటీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. స్తంభాలు కనిపించకుండా భూగర్భం నుంచి కేబుల్స్ వేసేందుకు రూ.4వేల కోట్లు కేటాయించారు. ఇది నగర రూపురేఖలను పూర్తిగా మార్చే కీలక నిర్ణయం. జనవరి నుంచి హైదరాబాద్‌లో రోజూ మంచినీటిని సరఫరా చేయాలన్న సీఎం నిర్ణయం హర్షణీయం. గ్రేటర్ హైదరాబాద్ అంతటా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తా. 300 డివిజన్లలో పార్టీ గెలిచి సత్తా చాటుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అలాగే, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేల గురించి దానంను విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదన్నారు.


