
ఒకరితో ఆదాయానికి, మరొకరితో నీటి వాటాకు గండి
ఏడాదిన్నరగా కాళేశ్వరంపై కుట్రలే.. ఎకరాకు నీరివ్వలేదు
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్, ఎల్లంపల్లికి కాల్వలు ఏవి?
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్ (తెల్ల ఏనుగు) అని విమర్శిస్తూ.. మరోవైపు అవే ప్రాజెక్టులో అంతర్భాగమైన రిజర్వాయర్లను ప్రభుత్వం వాడుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీమళ్లీ చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దు్రష్పచారం చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఏకైక ఎజెండాగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్, ఉత్తమ్ తెలంగాణ పాలిట నిజమైన తెల్ల ఏనుగులు అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రాష్ట్ర ఆదాయానికి, మంత్రి ఉత్తమ్ నీటి వాటాకు గండి కొడుతున్నారని విమర్శించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు మినహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆరోపించారు.
ఏడాదిన్నర అయినా తట్టెడు మట్టి తీయలేదు
గతంలో ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రతో పాటు కేంద్రంలోనూ ఏకకాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదని హరీశ్‌రావు విమర్శించారు. ‘తట్టెడు మట్టి తీయకుండా, ఒక్క ఇటుక పేర్చకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2,328 కోట్లు స్వాహా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో భూ సేకరణ, ఇతర పనుల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,780 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
మీరు ఆనాడు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి, ఎల్లంపల్లి వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి ఉంటే ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నరగా తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి తీయలేదు’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారని, మంత్రి మనసులో ఉన్న కుట్రకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని హరీశ్‌రావు మండిపడ్డారు.
గోదావరి జలాలు ఎత్తుకుపోతుంటే ఏం చేస్తున్నారు?
తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేసున్నా.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తూ, మిగతా 50 శాతం నిధులకోసం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి అప్పు చేసేందుకు అనుమతి ఇవ్వడం అన్యాయం, అనైతికం అని మండిపడ్డారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతూ, ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.