
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వదిలేసి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల లెక్కలను విడుదల చేశారు ఉత్తమ్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 43. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్ కు ఉత్తమ్ హితవు పలికారు. ఒకసారి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదని సూచించారు.
ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..
సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్
ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లాగ కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ ఇండ్ల కోటా ఇస్తామన్నారు పొంగులేటి. ఇక ఏపీలో కలిసిన ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.