
జూబ్లీహిల్స్‌లో బుల్డోజర్ పాలనకు, కారు సంక్షేమానికి పోటీ
పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్: కేటీఆర్
కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ప్రజలకు ఆరు గ్యారంటీలు వస్తాయి
లేదంటే ఏమీ చేయకున్నా గెలిపించారని సీఎం అనుకుంటారు
మాగంటి సునీత గెలుపు ఖాయం: మాజీ మంత్రి హరీశ్‌రావు
రహమత్‌నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపించే కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మేలు కాంక్షించే కారు పార్టీకి మధ్యే ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్‌ఎస్ కావాలో, హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చేయడమే ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సెగ తగిలేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. రహమత్‌నగర్ డివిజన్ క్వారీ మైదానంలో సోమవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ నగరాన్ని ‘హైడ్రా’బాద్‌గా మార్చి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్‌చోరీ అంటుంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీయే ఓట్‌చోరీకి పాల్పడిందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లను చేర్చిందని ఆరోపించారు.
ఇదే మోకా..
బీఆర్‌ఎస్ కార్యకర్తల కసి, పట్టుదల, తపన పార్టీ విజయానికి నాంది కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నవారు సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచి్చంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలి. గులాబీ జెండా రెపరెపలాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలి’అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వృద్ధులకు రూ.48 వేలు, పెళ్లి అయిన ఆడబిడ్డలకు తులం బంగారం, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.40 వేల చొప్పున బాకీ ఉందని అన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అందులో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్‌లో కొడితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి
ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల వరకు అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే ఉందని కేటీఆర్ అన్నారు. ‘ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని, ప్రజలు తనకే ఓట్లు వేస్తారని సీఎం రేవంత్ అనుకుంటారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని, ఇంత దివాళాకోరు సీఎంను ఎక్కడా చూడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
సునీత గెలుపు ఖాయం: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖాన వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారు. ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయమే. భారీ మెజారిటీ కోసమే మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్.. నియోజకవర్గ అభివృద్ధితో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
ఆయన ఆశయాలు నేరవేర్చాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నా బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని హరీశ్‌రావు కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నేతలు వద్దిరాజు రవిచంద్ర, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కౌషిక్ రెడ్డి, వేములు ప్రశాంత్‌రెడ్డి, ముఠా గోపాల్, మల్లారెడ్డి, వివేకానంద్‌గౌడ్, సుధీర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దాసోజు శ్రవణ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సునీత కంటతడి.. ఓదార్చిన సబిత
ఎస్పీఆర్ హిల్స్‌లో సోమవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో తన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న నాయకులు మౌనంగా ఉండిపోయారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీతను ఓదార్చారు.