
ధాన్యపు రాశుల వద్ద రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
యాసంగి సీజన్‌లో 40 లక్షల టన్నుల ధాన్యం కూడా కొనలేదు: హరీశ్‌రావు
ధాన్యపు రాశులు గాలికి..అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి
బీఆర్‌ఎస్ పార్టీలో నాయకత్వ సమస్య లేదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో సైనికుల తరహాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు యుద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అందాల పోటీలపై సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల కష్టాలు తీర్చేందుకు సమయం దొరకడం లేదని విమర్శించారు. ధాన్యపు రాశులను గాలికి వదిలి.. సీఎం రేవంత్ అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్నా.. సీఎం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పరిమితమవుతూ సచివాలయం ముఖం కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల మరణాలకు సీఎందే బాధ్యత
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో వేచి చూడటంతో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యపు రాశుల సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్న ఈ మరణాలకు సీఎం రేవంత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ‘వానకాలంలో రైతుబంధు సాయం ఎగవేసిన ప్రభుత్వం.. యాసంగిలో మూడు ఎకరాలకు మించిన రైతులకు ఇవ్వనే లేదు.
రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదు. పాకిస్తాన్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ.. రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరూ అప్పు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద బురద చల్లే తొందరలో సీఎం తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదు’అని ఎద్దేవా చేశారు. తాము రైతుల సమస్యల గురించి మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం అందజేసిన వివరాల ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.4 వేల కోట్లు చెల్లించాలని, సన్న వడ్లకు చెల్లించాల్సిన బోనస్ రూ.767 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి ఒప్పుకున్నారని తెలిపారు. చనిపోయిన రైతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు రూ.4 వేల కోట్ల బకాయి
ప్రస్తుత యాసంగి సీజన్‌లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు 48 గంటల్లో వడ్ల కొనుగోలు డబ్బులు ఇస్తామని చెప్పినా.. నేటికీ రూ.4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.
సన్న ధాన్యానికి రూ.512 కోట్ల బోనస్ కూడా విడుదల చేయలేదని చెప్పారు. రైతుల పక్షాన పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు నాయకత్వం ఇచ్చినా ఓకే
బీఆర్‌ఎస్ పార్టీలో నాయకత్వ సమస్య లేదని హరీశ్‌రావు తెలిపారు. ‘నేను పార్టీ పెడుతున్నట్లు, మరో పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వచి్చన తప్పుడు ప్రచారాన్ని గతంలోనే ఖండించా. మా పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ అంశంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మా పార్టీలో నాయకత్వ పంచాయితీ లేదు. కేసీఆర్ మా పార్టీ అ«ధ్యక్షుడు. ఆయన ఆదేశాలను పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను. కేటీఆర్‌కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా. కేసీఆర్ నిర్ణయాన్ని నేను జవదాటను’అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.