
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు(Jubilee Hills By Elections ) సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం..
షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆర్వో, ఏఆర్‌ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈఎస్‌ఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు.