ఏడు గ్రామాల్లో రూ.20,494 ఎకరాల సమీకరణకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి
104.01 ఎకరాల అసైన్డ్, 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా..
మొత్తం రూ.20,494 ఎకరాల సమీకరణకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడతలో 20,494.87 ఎకరాల భూసమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాల్లో 16,562.56 ఎకరాలు పట్టా, 104.01 ఎకరాల అసైన్డ్ భూమి కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరించనుంది. మంత్రుల బృందం(జీవోఎం) 21వ సమావేశం మినిట్స్ ప్రకారం ఆ భూములను ఏపీ సీఆర్‌డీఏ చట్టం సెక్షన్–55(2) ప్రకారం రైతుల నుంచి సమీకరించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలతోపాటు 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సీఆర్‌డీఏ కమిషనర్ సమీకరించనున్నారు. అంటే.. రెండో విడత భూసమీకరణలో మొత్తం 20,494.87 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ సమీకరించనుంది. రాజధానిలో రెండో విడత భూసమీకరణకు జూన్ 24న రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తొలుత గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 11 గ్రామాల్లో 44,676.44 ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది.
తొలుత ఏడు గ్రామాల పరిధిలో 20,494.87 ఎకరాల సమీకరణకు గత నెల 28న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో విడత భూసమీకరణ కింద భూములు ఇచ్చే రైతులకు జూలై 1న జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనం చేకూర్చుతామని ప్రభుత్వం పేర్కొంది.
భూసమీకరణ ఇలా...
ప్రస్తుతం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో పట్టాభూమి 1,965 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1,395.48 ఎకరాలు, పెదమద్దూరులో పట్టా భూమి 1,018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు, యండ్రాయిలో పట్టా భూమి 1,879 ఎకరాలు, అసైన్డ్ భూమి 46 ఎకరాలు, ప్రభుత్వ భూమి 241 ఎకరాలు, కర్లపూడి లేమల్లెలో పట్టా భూమి 2,603 ఎకరాలు, అసైన్డ్ భూమి 51 ఎకరాలు, ప్రభుత్వ భూమి 290.75 ఎకరాలను సమీకరిస్తారు.
అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో పట్టా భూమి 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72, ప్రభుత్వ భూమి 168.86, హరిశ్చంద్రాపురంలో పట్టా భూమి 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు, ప్రభుత్వ భూమి 977.87 ఎకరాలు, పెదపరిమిలో పట్టా భూమి 5,886.18 ఎకరాలు, ప్రభుత్వ భూములు 627.34 ఎకరాలను సమీకరిస్తారు.


