సాక్షి,హైదరాబాద్: జీహెచ్‌ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు విస్తరించడంతో పాటు, జోన్లు సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, 30 సర్కిల్స్‌ను 60కు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది.
జీహెచ్‌ఎంసీ వార్డుల డీ లిమిటేషన్‌పై కూడా ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు, పదిరోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6 వేలకు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఈరోజు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నిర్ణయంతో GHMC పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


