
హైదరాబాద్: బీఆర్ఎస్ లో విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు చెక్ పెట్టారు. అసలు బీఆర్ఎస్ లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘ మా పార్టీ బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. మా అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.
కాగా, ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు.
తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్ రావు.
ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..
సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు.