ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్‌ఎస్ పోస్ట్‌మార్టమ్
కాంగ్రెస్ ప్రలోభాలు, బెదిరింపులతోనే పార్టీ అభ్యర్థి ఓటమి
సానుభూతి కూడా ఉపకరించలేదనే భావన
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ యంత్రాంగం సర్వశక్తులూ ఒడ్డి కష్టపడినా కలిసి రాలేదనే అభిప్రాయం బీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడాన్ని బీఆర్‌ఎస్ సానుకూల ధోరణిలో చూస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మూడో స్థానంలో నిలిచిన పార్టీ ప్రస్తుతం 38 శాతం ఓట్లు సాధించడాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రలోభాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన బెదిరింపులు తదితరాల మూలంగానే పార్టీ అభ్యర్థి ఓటమి చెందారని భావిస్తోంది.
కలిసిరాని సానుభూతి
ఇతర పార్టీలతో పోలిస్తే పార్టీ అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసి, ప్రచార పర్వంలో దూసుకెళ్లినా స్థానిక పరిస్థితులు అనుకూలించలేదనే అభిప్రాయం బీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించినా సానుభూతి ఆశించిన స్థాయిలో కలిసి రాలేదని అంటున్నారు. ఆమె వైవాహిక జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి, ఘటనలు కొంత మేర ప్రభావం చూపి ఉంటాయని కూడా కొందరంటున్నారు. గోపీనాథ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత ఉన్నా అది ఓట్ల రూపం దాల్చలేదనే అంచనాకు వచ్చారు.
ప్రభుత్వ వ్యతిరేకతను నాటడంలో విఫలం
పార్టీ పరంగా ప్రచారం, సమన్వయం, ప్రచార ఎజెండా అన్నీ సక్రమంగానే ఉన్నా..ప్రభుత్వం పట్ల అన్నివర్గాల్లో ఉన్న వ్యతిరేకతను స్థానిక ప్రజల్లో బలంగా నాటలేకపోయామని బీఆర్‌ఎస్ భావిస్తోంది. బీజేపీ మొదటి నుంచీ ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించలేదని, క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నామమాత్ర ప్రచారానికే పరిమితం కావడం కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ, గతంలో రెండు పర్యాయాలు ఓడిపోయిన నవీన్‌యాదవ్‌కు ఆ పార్టీ టికెట్ ఇవ్వడం, అజారుద్దీన్‌కు మంత్రి పదవి, మంత్రివర్గం మొత్తం నియోజకవర్గంలో మోహరించడం ఆ పార్టీ గెలుపునకు కారణమయ్యాయని బీఆర్‌ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈసీ, పోలీసుల పనితీరుపై అసంతృప్తి
అధికార పార్టీ బెదిరింపులు, ప్రలోభాలు కూడా తమ ఓటమికి ప్రధాన కారణమని బీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి. నియోజకవర్గంలో సుమారు సగం మంది ఓటర్ల చిరునామాలు గందరగోళంగా ఉన్నాయని, వారు ఎక్కడ ఉంటారో కూడా తాము తెలుసుకోలేక పోయామని ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
నకిలీ ఓట్ల అంశాన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని అంటున్నారు. పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్లను పోలీసు విభాగం ఉద్దేశపూర్వకంగా నియంత్రించకపోవడం, ప్రలోభాలు, డబ్బు, చీరల పంపిణీ కూడా తమ విజయావకాశాలను దెబ్బతీశాయని విశ్లేషిస్తున్నారు.


