సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు రాజధాని నగరం సిద్ధమైంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2గంటల దాకా ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వీటిని గనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
న్యూఇయర్ ఆంక్షలు ఇలా ఉన్నాయి..
నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పైకి ఆ టైంలో నో ఎంట్రీ
బేగంపేట, టోలీచౌక్ మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేత
ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్ వేపైకి అనుమతి
రాత్రి 10గం. నుంచి 2గం. దాకా.. సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు నో ఎంట్రీ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో బుధవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి సర్వీసు బయలుదేరుతుంది. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం రాత్రి ఆలస్యంగా నడవనున్నాయని ఆయన పేర్కొన్నారు.
నూతన సంవత్సర స్వాగత వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 31, 2026 జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచే ఉంటాయి. ఇన్-హౌస్, ఈవెంట్ పర్మిట్ లైసెన్సులు కలిగినవారు కూడా రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయించుకోవచ్చు. ఈ మేరకు ప్రత్యేక అనుమతులిస్తూ ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులిచ్చింది.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఫుల్ ఫోకస్
డిసెంబర్ 31వ రోజు విచ్చలవిడిగా తాగి బండి నడిపే వారికోసం సాయంత్రం నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు నగర పోలీసులు. వారం నుంచి రాత్రిదాకా ఈ డ్రైవ్ కొసాగుతుండగా.. డిసెంబర్ 31న మాత్రం ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లు చేపట్టబోతున్నారు. హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సాధారణ ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
సేఫ్ సెలబ్రేషన్స్‌కు సీపీ పిలుపు
అలాగే.. తాగి ఇష్టానుసారం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినా శిక్షలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర సంబరాల పేరుతో రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ధ కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగర పౌరులు పోలీసులకు సహకరించి, కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.


