ఏపీ ముఖ్యమంత్రికో చిత్రమైన గుణం ఉంది. ఆయన ఎవరినైనా దూషించవచ్చు కానీ.. ఎవరైనా ఆయన్ను పల్లెత్తు మాట అన్నాసరే.. ‘‘చూశారా ఎంత మాటన్నారో?.. ప్రజల కోసం అన్నీ భరిస్తా’’ అనేస్తారు. ఇదీ ఇకరకమైన ప్లేటు ఫిరాయింపే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ సభలో ఇటీవల ఆయన మాట్లాడుతూ ‘‘వాజ్ పేయి వంటి ఉన్నత వ్యక్తులతో రాజకీయం చేసిన తాను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తోంది’’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు నాయకులు స్ఫూర్తినిస్తారు. మరికొందరు దేశం కోసం బతుకుతారు. ఇంకొందరు స్వార్థం కోసమే బతుకుతారు’’ అని కూడా వ్యాఖ్యానించినట్లు తెలుగుదేశం మీడియా తన కథనంలో తెలిపింది. విపక్షమైనంత మాత్రాన వారిని చిల్లర వ్యక్తులతో పోల్చడం ఏపాటి సభ్యత? గురువింద గింజ సామెత ఆయనకు గుర్తురాలేదా? ఎవరేమైనా అనని దులుపుకుని పోవడమే ఆయన నైజమా?
వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పరిస్థితులకు ఎంతో తేడా ఉంది. ఒకపక్క చంద్రబాబు పాలన వ్యవస్థల్లో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలనే అనుసరిస్తూ ఇంకోపక్క ఇష్టారీతిని భూముల పందేరం పెడుతున్నారు. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల్లో 95 శాతం వరకూ నెరవేర్చిన జగన్‌కు.. ఇచ్చిన హామీల్లో దాదాపు ఏవీ నెరవేర్చని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి పోలికెక్కడ? ఈ రెండు అంశాలు చాలవా? ఎవరిది చిల్లర రాజకీయమో అర్థం చేసుకునేందుకు? గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రంలో పాలనను ప్రజల చెంతకు చేర్చిన ఘనత జగన్‌ది.
గతిలేక... తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కొనసాగించాల్సిన స్థితి చంద్రబాబుది. అందుకే కదా జగన్ పథకాల పేర్లు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడింది? ఇది చిల్లరతనం కాదా? అని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది కదా! వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనం కూడా రూ.పదివేలకు పెంచుతామన్న ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కడం చిల్లరతనం కాదా? అని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీర ప్రాంతాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు జగన్ చేపట్టిన నౌకాశ్రయాలను చూపి చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడులు అడుగుతున్నారని గుర్తు చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఏకంగా 17 వైద్య కళాశాలలను తీసుకొస్తే అందులో జగన్ స్వార్థం కనిపిస్తుందా? పేద విద్యార్ధుల విద్య, పేద ప్రజలకు మంచి వైద్యం అప్పగించాలన్నదే ఆయన లక్ష్యం కనిపిస్తుందా??
ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఒక్క ప్రభుత్వమెడికల్ కాలేజీని తన హయాంలో తేలేదు? పైగా జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ఎకరా వంద రూపాయల లీజుకు కట్టబెట్టి ప్రైవేటు వారికి సంపదగా మారుస్తున్నారే? దీనిని బట్టి అర్థం కాదా? ఎవరు స్వార్థపరులన్నది? జగన్ తెచ్చిన కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేశ్‌లు ఇప్పుడు ఏకంగా కాలేజీలనే ప్రైవేటికరిస్తూ జనం దృష్టిలో విలన్లుగా మారారన్న సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ, వలంటీర్లు కిడ్పాప్ చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చిల్లరవి కావా? అధికారంలోకి వచ్చాకైనా వీటిలో ఒక్కదానికైనా ఆధారం చూపించారా?ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయజాలం. కాని ఆయనే అనవసర కామెట్లు చేస్తున్నారనిపిస్తుంది.
ఇక రాజకీయ కోణం చూద్దాం. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో వేసిన గుంతులు, కట్టిన పొత్తులు ఏ సిద్ధాంతపరమైన రాజకీయాలకు ప్రతీకలు? మామ ఎన్టీఆర్‌పై కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేస్తానని తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు 1983 ఎన్నికలలో ఓటమి తర్వాత బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీలోకి ఫిరాయించేశారే! మరి జగన్ ఏమి చేశారు. తాను విబేధించిన కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు.
దీనిని ప్రతిష్టాత్మక వ్యవహారం అంటారు కాని జెండాలు మార్చే చిల్లర రాజకీయం అనరు కదా! 1995లో ఎన్టీ రామారావును దించడానికి తనకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా ఎంతగా అప్రతిష్టపాలు చేసింది చరిత్రలో ఉంది కదా! అది ఏమైనా ఘనమైన విషయమా? ఎన్టీ రామారావే చంద్రబాబు బుద్ధి, నైజం గురించి ఎంత ఘోరంగా దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయే!. అది ఏపాటి గౌరవమో చంద్రబాబు చెప్పగలరా? ఆ ఎపిసోడ్‌లో వాజ్‌పేయి వంటివారు ఎన్టీఆర్‌కే మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా? ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కొత్తగా పెట్టిన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా! 1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించే వారా? కాదా?ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌ను గోదాట్లో ముంచి బీజేపీకి మద్దతు ఇచ్చారా?లేదా? 2001-02 మధ్య గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు ఉండకపోవచ్చు.

ఆ తర్వాత కాలంలో ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి 2014లో పొత్తు పెట్టుకుంది నిజమా? కాదా? 2004 ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమికి గురైన తర్వాత జీవితంలో బీజేపీతో కలవనని ప్రకటించారా? లేదా? ఇప్పుడేమో వాజ్ పేయి, నరేంద్ర మోడీ తనకు స్ఫూర్తి అని ప్రకటించుకుంటున్నారు. ఆయన ఎలాగైనా రూపాంతరం చెందగలరన్నమాట. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని 2009 ఎన్నికలలో పోటీ చేయడానికి రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారా?లేదా? తీరా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చాక ఎన్ని మాటలు మార్చారు? తెలంగాణలో తన వల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీకి వెళ్లి రాష్ట్రాన్ని సోనియాగాంధీ నాశనం చేశారని ఎంతగా నిందించారు? దీనిని ఏ రాజకీయం అంటారు? 2018లొ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాని మోడీని ఎన్ని మాటలు అన్నారో తెలియదా? దేశ ప్రధానినే టెర్రరిస్టు అన్న చరిత్ర చంద్రబాబుదే కావచ్చు.
ఆ రోజుల్లో టీడీపీ మీడియాలో వచ్చిన కొన్ని హెడ్డింగ్‌లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాల మోడీ, బీజేపీకి సహకరించే వాళ్లు దేశద్రోహులు, మోడీని దింపేస్తాం, మోడీ హటావో..మోడీతో రాజీ లేదు..రెచ్చిపోతా..,ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చిన చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు మోడీ, అమిత్ షాలతో కలవడానికి ఎన్ని పాట్లుపడింది ఇటీవలి చరిత్రే కదా? మధ్యలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలలో పోటీచేశారే. ఆ తర్వాత వారిని గాలికి వదలివేశారే! వీటిని రాజకీయ వ్యూహాలు అంటారా? లేక అవకాశవాద రాజకీయాలు అంటారా? లేక చిల్లర రాజకీయాలు అంటారా అన్నదానిపై ఎప్పుడైనా టీడీపీ వివరణ ఇచ్చిందా? మరి జగన్ ఎప్పుడైనా ఇలాంటి అవకాశవాద, లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారా? నిజానికి బీజేపీ కోరిన విధంగా జగన్ ఎన్డీయేలో చేరి ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. విధానాల మీద అభిప్రాయం చెప్పవచ్చు కాని రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని కింపచరిచే విధంగా మాట్లాడి రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటే ఎదురుదెబ్బ తప్పదు.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


