విజయోత్సవ ర్యాలీలో నవీన్‌యాదవ్
గాందీభవన్‌లో మిన్నంటిన సంబురాలు
రంగంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు
డివిజన్లు, బూత్‌ల వారీగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు..
ఎప్పటికప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంల పర్యవేక్షణ..బాధ్యులకు సూచనలు
ఘన విజయం సాధించడంతో పార్టీలో కొత్త ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనకు అగ్నిపరీక్షగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లభించిన ఘన విజయంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. గత రెండేళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ జరిగిన ఎన్నికలో విజయం లభించడంతో సీఎం, మంత్రులు, పార్టీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్టీ నేతలంతా పని విభజన చేసుకుని ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడంతోనే ఈ స్థాయిలో విజయం సాధ్యమయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యవేక్షణ, పోల్ మేనేజ్‌మెంట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జీహెచ్‌ఎంసీ నేతలు, చివరకు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు నియోజకవర్గంలోనే ఉండి పని చేయడం పార్టీ గెలుపునకు బాటలు వేసిందని అంటున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లను కలవడం, ఓటర్లు మెచ్చేలా వారికి హామీలివ్వడం లాంటి అంశాలు కాంగ్రెస్‌కు ఉపకరించాయని రాజకీయ వర్గాలంటున్నాయి.
సీఎం... సీరియస్‌గా..
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నిక షెడ్యూల్ రాకముందు నుంచే సమావేశాలు, సమీక్షలు నిర్వహించిన ఆయన.. పోలింగ్ సమయం సమీపించే కొద్దీ ఫోకస్ మరింత పెంచారు. ముఖ్యంగా మంత్రులు, ఎన్నికల బాధ్యులతో పలుమార్లు సమావేశమై ఈ ఎన్నిక ఎందుకు గెలవాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు.
ఈ ఎన్నికలో గెలుపోటములు తనతో సహా అందరిపై ప్రభావం చూపుతాయని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి సానుకూల ఫలితం రాబట్టాలని పలుమార్లు హెచ్చరించారు. ప్రచార పర్వాన్ని స్వయంగా ముందుండి నడిపించారు. రెండు దఫాలుగా ఆరు రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంతో పాటు నవీన్‌ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
చివరి మూడు, నాలుగు రోజులు పార్టీ బలగాన్ని ఉరుకులు పెట్టించేలా కార్యాచరణ రూపొందించడం ద్వారా తన పాలనకు రెఫరెండంగా భావించిన ఉప ఎన్నికలో పార్టీని గెలిపించడమే కాకుండా తన పట్టు కూడా నిరూపించుకున్నారు. ఇక పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక కావడం, ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా లిట్మస్ టెస్టుగా మారిన నేపథ్యంలో.. విజయం దక్కడంతో పార్టీ ఊపిరి పీల్చుకుంది.
బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి..
ఉప ఎన్నికలో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు గాం«దీభవన్‌లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు.
మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కుమార్‌రావు, సంగిశెట్టి జగదీశ్వరరావు, కైలాశ్‌నాగేశ్, అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్ తదితరులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. ఇక ఫలితాలు వెలువడుతున్న సమయంలో కొందరు మంత్రులు జూబ్లీ క్లబ్‌లో సమావేశమయ్యారు. ఫలితం వెలువడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి పార్టీ నేతలు, మంత్రులు క్యూ కట్టారు.


