మందడంలో చర్చనీయాంశంగా మారిన ఎన్–8 రహదారి
రెండు లక్షల జనాభా లేని ప్రాంతంలో హడావుడిగా పెద్ద రోడ్డా ?
గ్రామం చుట్టూ ఉన్న నాలుగు రోడ్లు పూర్తి చేసి, రహదారుల పక్కన ప్లాట్లు ఇవ్వాలంటున్న రాజధాని రైతులు
ప్రభుత్వం తొందరపాటుతోనే గుండె పగిలి రాజధాని రైతు మృతి
ఏమీ లేనిచోట మంత్రి, ఎమ్మెల్యేలు హడావుడి చేసి రైతులను ఒత్తిడికి గురిచేయడం ఏంటని ప్రశ్న
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: ప్రభుత్వ తొందరపాటు చర్య ఒక నిండు ప్రాణం తీసింది. మంత్రులు, ఎమ్మెల్యేల హడావుడి సీఆర్డీఏ అధికారుల ఒత్తిడి కారణంగా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన రైతు రామారావు గుండె పగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు లక్షల జనాభా కూడా లేని ప్రాంతంలో ఈ హడావుడి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఇళ్ళు తొలగించి రోడ్డు వేయాలంటూ స్వయంగా మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఒత్తిడికి చేయడంపై ఆందోళనకు గురవుతున్నారు. గ్రామం చుట్టూ ఉన్న నాలుగు రోడ్లు పూర్తిచేసి రహదారుల పక్కన ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తే బావుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ప్లాట్లు ఎక్కడ ఇస్తారో, ఏఏ వసతులు కల్పిస్తారో చెప్పకుండా పరిహారం గురించి చెప్పమని ఒత్తిడికి గురిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద రోడ్డు అవసరమా
రాజధాని అమరావతి పరిధిలో మందడం పెద్ద గ్రామం. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లో ఈ గ్రామం చుట్టూ నాలుగు రోడ్లు వెళుతున్నాయి. ఉత్తరం వైపున ఈ–3 సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. మధ్యలో ఈ–4 రోడ్డు ఉంది. తూర్పున ఎన్–7 రోడ్డు ఉంది. ఈ రెండు రోడ్లు గ్రామానికి ఆనుకునే ఉంటాయి. దక్షిణాన ఈ–5 రోడ్డు వెళ్తుంది. పడమటివైపు మందడం మల్కాపురం గ్రామానికి అనుకొని ఎన్–9 రోడ్డు వెళుతుంది. ప్రస్తుతం ఈ రోడ్డు ద్వారానే వెలగపూడి సెక్రటేరియట్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ చూస్తే మందడం గ్రామానికి చుట్టూ సరిహద్దు గోడలాగా ఈ రోడ్లన్నీ కనిపిస్తుంటా యి. అయితే ఇప్పుడు చర్చ జరిగిన రోడ్డు ఈ–8 రహదారి. ఇది సీబీడీ అంటే సీడ్ బిజినెస్ డిస్టిక్‌కు అనుసంధానంగా నిర్మిస్తున్న మేజర్ ఆరీ్టరియల్ రోడ్డు. అంటే 200 అడుగులు వెడల్పుతో ఉంటుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు నిర్మించాల్సిందే. కానీ ఇంత పెద్ద రోడ్డు ఇప్పటికిప్పుడు గ్రామం మధ్యలో నుంచి నిర్మించడం అవసరమా అనేది రైతుల ప్రశ్న.
25 లక్షల జనాభా కోసం డిజైన్ చేసిన రోడ్డు అది...
సుమారు పాతిక లక్షల జనాభాకు అనుగుణంగా ఈ రోడ్లను డిజైన్ చేశారు. ప్రస్తుతం రాజధానిలో రెండు లక్షలు జనాభా కూడా లేదు. మరి అలాంటప్పుడు భారీగా ఇళ్లను తొలగించి నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు ఇళ్లు కూడా ఇచ్చేయాలా అనే ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా రైతులపై ఒత్తిడి తేవడం వల్లే రైతు రామారావు మృతి చెందాడని రాజధాని ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


