ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ రాకపోవడంపై బీజేపీ విస్మయం
2023లో కన్నా ఓట్లు 8 వేలు తగ్గడంపై నిరాశా నిస్పృహలు
ఊహించని ఫలితాలు వస్తాయని ఆశించిన కమలనాథులకు భంగపాటు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పెద్దఎత్తున ప్రచారం చేసినా కనీసం డిపాజిట్ దక్కకపోవడంపై కమలదళంలో విస్మయం వ్యక్తమవుతోంది. బిహార్‌లో హిట్టు... జూబ్లీహిల్స్‌లో ఫట్టు అన్నట్టుగా పరిస్థితి తయారైందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కి వచ్చిన 25 వేల ఓట్లతో పోల్చితే.. ఇప్పుడు ఓట్లు 17 వేలకు పడిపోవడంపై నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఐదారు నెలల క్రితమే ఇక్కడ ఉప ఎన్నిక తప్పదని తెలిసినా ముందునుంచే పార్టీ సరైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోకపోవడం పెద్ద మైనస్ అని అభిప్రాయపడుతున్నారు. సమష్టిగా ఎదుర్కోవడంలో అనుసరించాల్సిన వ్యూహం విషయంలో ముఖ్యనేతల సమన్వయ లేమి, నిరాసక్తత కూడా జూబ్లీహిల్స్‌లో ప్రభావం చూపిందంటున్నారు.
అభ్యర్థి ఖరారులో ఆలస్యం
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు దీటుగా బీజేపీ కూడా ప్రధాన పోటీలో ఉంటుందనే భావనను ఓటర్లలో కలిగించకపోవడం కూడా నష్టం చేసిందని చెబుతున్నారు. త్రిముఖ పోటీలో ఊహించని ఫలితాలు దక్కుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా ముఖ్యనేతలు ఆశించగా అది జరగలేదు. ప్రధానపోటీ కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్యే ఉండటంతో బీజేపీ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండటంతో ఇక్కడి గెలుపోటములు, ప్రచార బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదేననే భావన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో స్థిరపడటం కూడా చేటు చేసిందంటున్నారు. ఎన్నికల వ్యూహం, ప్రచారం, ఎజెండా ఇలా మొత్తం భారమంతా కిషన్‌రెడ్డిపైనే పడటంతోపాటు బాధ్యతంతా ఆయనదే అన్నట్టుగా నేతలు వ్యవహరించడంతో చేటు జరిగిందని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికే ఉప ఎన్నికలో సీట్లు కేటాయిస్తుండటం బీజేపీలో ఆనవాయితీగా మారినా, జూబ్లీహిల్స్‌లో అభ్యర్థి ఖరారు అనేది మరీ ఆలస్యం కావడం కూడా పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారడానికి కారణమని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు, ఒక వర్గం ఓట్ల కోసం పాకులాడుతున్నారనే విమర్శలతోనే కాలం వెళ్లబుచ్చి, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించడంలో ముఖ్యనేతలు విఫలమయ్యారని పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.
ఓటర్ల మధ్య మత ప్రాతిపదికన పోలరైజేషన్ కోసం ప్రయత్నం తప్ప గెలుపుపై విశ్వాసంతో లేదా కనీసం రెండోస్థానంలో నిలిచే దిశలో కృషి జరగలేదని పార్టీనేతలు భావిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు మాదిరిగా జూబ్లీహిల్స్‌లో జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందించలేదని కొందరు నాయకులు అంటున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలు ప్రచారానికి వచ్చి ఉంటే కొంతమేర సానుకూల ప్రభావం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


