ముసాయిదా బడ్జెట్‌కు ఓకే
రూ.11,460 కోట్ల ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కోసం రూపొందించిన రూ.11,460 కోట్ల ముసాయిదా బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ సమావేశం పచ్చజెండా ఊపింది. సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం రాబోయే ఆర్థిక సంవత్సరానికి(2026–27) సంబంధించిన ఈ బడ్జెట్‌ను ఆమోదించింది. జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే పాలకమండలి సర్వసభ్య సమావేశంలోనూ దీనికి ఆమోదముద్ర వేసి, ప్రభుత్వానికి సమాచార నిమిత్తం పంపనున్నారు. మొత్తం బడ్జెట్‌లో పాత జీహెచ్‌ఎంసీకి రూ.9,200 కోట్లు కేటాయించగా, విలీనమైన 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు మిగతా రూ.2,260 కోట్లను విడిగా కేటాయించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.8,880 కోట్లు కేటాయించగా, రివైజ్డ్ చేసి రూ.9వేల కోట్లకు అప్పట్లో పెంచారు. అయితే గత అక్టోబర్ వరకు కేవలం రూ.4,020 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ, ప్రస్తుత పాలకమండలి గడువు నెలన్నరలోపునే ముగిసిపోనుండటంతో ఎన్ని నిధులు ఖర్చు అవుతాయో వేచి చూడాల్సిందే.
ఇతర ముఖ్యాంశాలు..
● జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఏఐ ఆధారిత సొల్యూషన్ల అమలు, నిర్వహణ కోసం మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ ఎంపికకుగాను ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలిచేందుకు ఆమోదం. ఇందులో ఏఐ చాట్‌బాట్, ఆటోమేటెడ్ ఫారమ్ ఫిల్లింగ్ సొల్యూషన్లు ఉన్నాయి.
● చందానగర్ సర్కిల్‌లోని ఇజ్జత్‌నగర్ బీసీ వైకుంఠధామంలో దహన యూనిట్ ఏర్పాటు, పూజా మండపం, దింపుడు కల్లం, గ్యాలరీలు, మరుగుదొడ్లు, కలప నిల్వ గది, ఇంకుడుగుంత, ఇతర పనులకు ఆమోదం
● జాంబాగ్ వార్డు పరిధిలో 94 నెంబర్ బస్‌స్టాప్ దగ్గర విజయ డెయిరీ నుంచి యూనివర్సల్ బుక్‌స్టోర్ వరకు, ఈఎన్‌టీ ఆసుపత్రి క్యాంపస్ వెలుపల బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
● వాహనదారులు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించేందుకు తార్నాక జంక్షన్‌లో సర్వజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్సార్ కింద హెల్మెట్ శిల్పం ఏర్పాటుకు అనుమతి. వివిధ సంస్థల సీఎస్సార్ పనులకు గ్రీన్‌సిగ్నల్. ఇప్పటికే చేస్తున్నవాటి పొడిగింపునకు ఓకే
● దోమల్‌గూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్ లీజు గడువు పొడిగింపునకు అనుమతి
● మాసబ్ ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్క్ స్పోర్ట్స్’ ప్లే గ్రౌండ్‌ను అనధికారికంగా ఆక్రమించి, 33 ఏళ్లుగా లీజు చెల్లించని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌పై చర్యలు తీసుకునేందుకు సుముఖత
● ఎన్‌బీటీ నగర్ మల్టీపర్పస్ భవనం పేరును ఎన్‌బీటీ నగర్ కన్వెన్షన్ హాల్‌గా మార్చేందుకు అనుమతి
● డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లోని జై జవాన్ కాలనీ(ఎక్స్–సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్) వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్(10) దుకాణాలు/యూనిట్‌ల టెండర్ కమ్ ఓపెన్ పబ్లిక్ వేలం నిర్వహణకు ఆమోదం
లాస్ట్ టూర్..
బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం ముగిశాక, 22 అంశాలపై స్టాండింగ్ కమిటీ చర్చించింది. పదవీకాలం గడచిపోతుండటంతో స్టడీ టూర్ పేరిట కార్పొరేటర్లు అహ్మదాబాద్, చంఢీగఢ్ నగరాలను చుట్టివచ్చే అంశంతోపాటు ఇతర అంశాలకు ఓకే చెప్పింది. కార్పొరేటర్ల స్టడీ టూర్ కోసం జీహెచ్‌ఎంసీ దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేయనుంది. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
త్వరలో జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ముందుకు..
ఎవరేమనుకున్నా స్టడీ టూర్లకూ రెడీ!


