కార్మిక దళం.. ఉద్యమ గళం
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నగరంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టేషన్‌లు తదితర ప్రాంతాల్లో ఆటోసేవలు స్తంభించాయి. మరోవైపు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయంటూ నినాదాలు చేశారు. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని, రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సారథి పోర్టల్‌ను రద్దు చేయాలని ఆటో సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో, ట్రాన్స్‌పోర్ట్ సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం, ఎ. సత్తిరెడ్డి, లారీ సంఘం నాయకులు రాజేందర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, సీహెచ్ జంగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. – సాక్షి, సిటీబ్యూరో


