కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ | Directors and Actors Turned Politicians in Kerala | Sakshi
Sakshi News home page

కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ

Mar 30 2026 7:41 AM | Updated on Mar 30 2026 8:51 AM

Directors and Actors Turned Politicians in Kerala

దేశంలో అటు సినిమా, ఇటు రాజకీయం.. ఈ రెండూ నాణేనికి రెండు పార్శ్వాల వంటివని అంటుంటారు. వెండితెరపై వెలిగిన తారలు ప్రజాక్షేత్రంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం దశాబ్దాలుగా  కొనసాగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. మాలీవుడ్‌ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమదైన ముద్ర వేసిన ఐదుగురు ప్రముఖ దర్శకులు, నటుల ప్రస్థానం ఇలా..

రాము కారియాట్: ట్రెండ్ సెట్టర్
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారిలో దిగ్గజ దర్శకులు రాము కారియాట్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘నీలకుయిల్’ (1954) తదితర గొప్ప చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, జాతీయ అవార్డు గెలుచుకున్న 'చెమ్మీన్' (1967) సినిమాతో మరో చరిత్ర సృష్టించారు. కేరళలో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఎన్నికల బరిలోకి దిగే సంప్రదాయాన్ని ఆయనే మొదలుపెట్టారు. 1965లో త్రిసూర్ జిల్లాలోని నాటిక నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఘనవిజయం సాధించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.

ఇన్నోసెంట్: హాస్య చక్రవర్తి నుంచి పార్లమెంటు వరకు..
ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించిన ఇన్నోసెంట్ వరీద్ తెక్కెతల.. తన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు ఉన్న దశలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చలకుడి నియోజకవర్గం నుంచి ఎల్‌డిఎఫ్ (ఎల్‌డీఎఫ్‌)మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఒక హాస్య నటుడిగా కేరళ ప్రజల హృదయాల్లో నిలిచిన ఆయన, పార్లమెంటు సభ్యుడిగానూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

సురేష్ గోపి: కేరళలో బీజేపీ సత్తా
మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘మణిచిత్రతాజు’ (1993) వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఆయన, 2016లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. చివరకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో అదే త్రిసూర్ నుంచి ఘనవిజయం సాధించి, కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు.

గణేష్ కుమార్: రాజకీయ వారసుడు
నటుడు కేబీ గణేష్ కుమార్ అటు సినిమా, ఇటు రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సీనియర్ నాయకుడు ఆర్. బాలకృష్ణ పిళ్ళై కుమారుడైన గణేష్ కుమార్.. 2023 నుంచి కేరళ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ‘మణిచిత్రతాజు’, ‘కమిషనర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన, రాజకీయాల్లోనూ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని కీలక  నేతగా ఎదిగారు.

రమేష్ పిషారోడి: 2026 బరిలో కొత్త ఆశ
ప్రముఖ నటుడు, కమెడియన్ రమేష్ పిషారోడి ఇప్పుడు 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం పిషారోడిని బరిలోకి దించింది. రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోవాలని ఆయన సిద్ధమవుతున్నారు.

కేరళ రాజకీయ ముఖచిత్రంలో సినీ సెలబ్రిటీల పాత్ర ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 1965లో రాము కారియాట్ వేసిన పునాది నుంచి నేడు రమేష్ పిషారోడి వరకు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికల్లో మలయాళీ ఓటర్లు మరోసారి వెండితెర తారలకు పట్టం కడతారో లేదో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement