ఇక ప్రోగ్రామర్లకు గుడ్‌బై: గూగుల్ మాజీ సీఈఓ | Top programmers dont code Former Google CEO | Sakshi
Sakshi News home page

ఇక ప్రోగ్రామర్లకు గుడ్‌బై: గూగుల్ మాజీ సీఈఓ

Mar 30 2026 11:39 AM | Updated on Mar 30 2026 11:48 AM

Top programmers dont code Former Google CEO

‘సాఫ్ట్‌వేర్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఇంజనీర్లు నెలల తరబడి చేసే పనిని, ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం ఏఐ సాయంతో ఒకే రాత్రిలో పూర్తి చేసేస్తున్నాడు’.. గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ కిడ్మట్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

నిద్రపోతున్నప్పుడు పని పూర్తి చేసే ఏఐ
టాప్ ప్రోగ్రామర్లు ఇప్పుడు స్వయంగా కోడింగ్ రాయడం మానేశారని ఎరిక్ తెలిపారు. దానికి బదులుగా వారు కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఫలితాలను సరిచూసే ‘టెస్ట్ ఫంక్షన్స్’ రాస్తున్నారు. మిగతా పనినంతా కృత్రిమ మేధ చూసుకుంటోంది. తన స్టార్టప్‌లోని ఒక ప్రోగ్రామర్ చేసే పనిని ఆయన ప్రస్తావించారు. ఆ ప్రోగ్రామర్ సాయంత్రం ఏఐకి పని అప్పజెప్పి నిద్రపోతే, తెల్లవారుజామున 4 గంటలకల్లా ప్రాజెక్ట్ పూర్తవుతోంది. ఇదే పనిని గూగుల్‌లో చేయాలంటే 10 మంది ప్రోగ్రామర్లు, ఆరు నెలల సమయం పట్టేది’ అని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగాలు పోతాయా?
ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాముఖ్యత తగ్గుతుందని భావిస్తున్న వారికి ఎరిక్ ఒక కొత్త కోణాన్ని చూపారు. నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు డిమాండ్ తగ్గకపోగా, మరింత పెరుగుతుందన్నారు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారే భవిష్యత్తులో కొత్త ప్రపంచాలను సృష్టిస్తారని చెప్పారు. కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు.. అకౌంటింగ్, బిల్లింగ్, లాజిస్టిక్స్ తదితర ఖర్చుతో కూడిన వ్యాపార కార్యకలాపాలను కూడా ఏఐ సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు.

2029 నాటికి భారీ మార్పులు
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) 2029 నాటికే అందుబాటులోకి రావచ్చని ఎరిక్ అంచనా వేశారు. స్వయంగా నేర్చుకుని, ప్లాన్ చేసుకునే ఏఐ వ్యవస్థల వల్ల వైద్యం, వాతావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఆయన వివరించారు. మొత్తం మీద, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ‘కోడింగ్’ నుంచి ‘ఆర్కెస్ట్రేటింగ్’ (ఏఐని నడిపించడం) వైపు మారుతోందని  ఎరిక్ కిడ్మట్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా

Advertisement
 
Advertisement
Advertisement