పట్నా: బిహార్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి (ఎంఎల్‌సీ) సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ ఈ రాజీనామా లేఖను కౌన్సిల్ సెక్రటేరియట్‌కు సమర్పించారు.
గడువు ముగియడంతో నిర్ణయం
మార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. 1950 నాటి ‘ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్‌షిప్’ నిబంధనల ప్రకారం, ఎన్నికైన 14 రోజుల లోపు ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మార్చి 30 (సోమవారం) నాటితో ముగియనుండటంతో, చివరి రోజున ఆయన తన ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.
మరిన్ని మార్పులు ఖాయమేనా?
నితీష్ కుమార్ మాత్రమే కాకుండా, బీజేపీ నేత నితిన్ నబిన్ కూడా బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల కారణంగా ఆయన రాజీనామా ప్రక్రియలో స్వల్ప ఆలస్యం జరిగిందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరోగి త్వరలోనే ఆ లేఖను సమర్పిస్తారని సమాచారం.
తదుపరి సీఎం ఎవరు?
నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ తదితర అగ్రనేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుత బాధ్యతలకు సంబంధించి రానున్న కొద్ది రోజుల్లో పార్టీ నుంచి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


