పతనంతిట్ట: వయసు సెంచరీ దాటినా, ఓటు వేయాలనే ఉత్సాహం ఆ తాతలో ఏ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేరళకు చెందిన 101 ఏళ్ల గంగాధరన్ ఆచారి ఓటర్లకు అసలైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారు. ఎవరి సాయం లేకుండా, స్వయంగా పోలింగ్ బూత్‌కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ, ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటిచెబుతున్నారు. ఏప్రిల్ 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు గంగాధరన్ ఆచారి ఎదురు చూస్తున్నారు.
నాడు ఇంటి పన్ను చెల్లిస్తేనే ఓటు..
పతనంతిట్ట జిల్లా అడూర్ సమీపంలోని చెరుకోడ్ నివాసి అయిన గంగాధరన్ ఆచారి 1925లో జన్మించారు. ఆయన తన మొదటి ఓటును ఓమల్లూర్‌లో వేశారు. ఆ రోజుల్లో ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు; కేవలం ఇంటి పన్ను చెల్లించే వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండేది. రేడియో ద్వారా ఎన్నికల అవగాహన కార్యక్రమాలను విని, ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన పెంచుకున్నానని ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి నేటి మూడంచెల పంచాయతీ ఎన్నికల వరకు ఆయన నిరంతరాయంగా ఓటు వేస్తూనే ఉన్నారు.
ఒక చరిత్ర పుట
గంగాధరన్ ఆచారి జీవితం ఒక చరిత్ర పుటలాంటిది. తన యవ్వనంలో ఇలంతూర్ పర్యటనకు వచ్చిన మహాత్మా గాంధీని ఆయన స్వయంగా చూశారు. అంతేకాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్, చిత్ర తిరునాల్, సర్ సి.పి. వంటి మహోన్నత వ్యక్తులను వివిధ సందర్భాల్లో కలిశారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, అప్పటి పరిస్థితులు, అభ్యర్థుల గుణగణాలను బట్టే తాను ఓటు వేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్య రహస్యం ఇదే
101 ఏళ్ల వయసులోనూ గంగాధరన్ ఎంతో దృఢంగా ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, అర కిలోమీటరు దూరం నడవడం ఆయన దినచర్యలో భాగం. పరోటా, ఎగ్ కర్రీ, పాలు వంటి ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటారు. వయసు రీత్యా పళ్లు ఊడిపోయినా, మనసు మాత్రం ఇంకా పడుచుగానే ఉందని ఆయన నవ్వుతూ చెబుతారు.
కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, ఎన్నికల రోజున ఎవరిపై ఆధారపడకుండా ఒంటరిగానే పోలింగ్ బూత్‌కు వెళ్లడం ఆయన ప్రత్యేకత. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు ఆయన ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఓటు వేయడం అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు, అదొక థ్రిల్లింగ్ అనుభూతి అని గంగాధరన్ ఆచారి అంటున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఇక ప్రోగ్రామర్లకు గుడ్‌బై: గూగుల్ మాజీ సీఈఓ


