షాకింగ్‌: ఇండియా పోస్ట్ పేరుతో కొత్త దందా | India Post 170th Anniversary Gifts Scam | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: ఇండియా పోస్ట్ పేరుతో కొత్త దందా

Mar 30 2026 8:45 AM | Updated on Mar 30 2026 9:35 AM

India Post 170th Anniversary Gifts Scam

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు వచ్చాయని మెసేజ్ మీకు వచ్చిందా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ లింక్‌ను క్లిక్ చేసే ముందు ఇది తప్పక చదవండి. లేదంటే మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. భారత తపాలా శాఖ (India Post) పేరుతో ప్రస్తుతం ఒక నకిలీ లక్కీ డ్రా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 170 ఏళ్ల వేడుకల సందర్భంగా ఉచిత బహుమతులు అందిస్తున్నామంటూ యూజర్లను ఈ స్కామ్ ఊరిస్తోంది. బహుమతులు గెలుచుకోవాలంటే కొన్ని వివరాలు నమోదు చేయాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

ప్రభుత్వం ఏమంటోంది?
దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇప్పటికే స్పందించింది. ఇదంతా ఒక పెద్ద మోసమని, ఇండియా పోస్ట్ ఇలాంటి లక్కీ డ్రాలు గానీ, బహుమతుల పంపిణీ గానీ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’లో సంబంధిత అధికారులు.. ‘ఇండియా పోస్ట్ పేరుతో జరుగుతున్న ఈ లక్కీ డ్రా నకిలీది. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి. మీ వ్యక్తిగత వివరాలను పంచుకోకండి’ అని హెచ్చరించారు.
 

సురక్షితంగా ఉండటం ఎలా?
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు నిపుణులు  కొన్ని సూచనలు చేస్తున్నారు..
అధికారిక సమాచారం: ఏదైనా ఆఫర్ లేదా ప్రమోషన్ గురించి తెలుసుకోవాలంటే ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే నమ్మండి.
అజ్ఞాత లింక్‌లు వద్దు: వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింక్‌లపై క్లిక్ చేయకండి. ముఖ్యంగా ఉచిత బహుమతులు అని చెప్పే వాటికి దూరంగా ఉండండి.
వ్యక్తిగత డేటా: ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు లేదా పిన్ నంబర్లను ఎవరికీ తెలియజేయకండి.
యాప్‌ల పట్ల జాగ్రత్త: గుర్తుతెలియని లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకండి.
సందేహం ఉంటే: ఏదైనా ఆఫర్ నిజమో కాదో తెలుసుకోవడానికి నేరుగా తపాలా శాఖ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. డిజిటల్ యుగంలో ఆశ చూపి, మోసం చేసే నేరగాళ్లు పెరిగిపోతున్నారు. అప్రమత్తంగా ఉండటమే ఇందుకు ఏకైక పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కువైట్‌: క్షిపణి దాడిలో భారత కార్మికుడు మృతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement