కువైట్ సిటీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింతగా ఎగబాకుతున్నాయి. ఇరాన్ జరిపిన తాజా క్షిపణి దాడిలో కువైట్‌లో పని చేస్తున్న ఓ భారత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం కువైట్‌లోని ఒక విద్యుత్, నీటి శుద్ధీకరణ ప్లాంట్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్లాంట్‌పై విరుచుకుపడ్డ క్షిపణులు
ఇరాన్ జరిపిన ఈ దాడిలో ప్లాంట్‌లోని ఒక సర్వీస్ భవనం పూర్తిగా ధ్వంసమైందని కువైట్ విద్యుత్, నీటి వనరుల శాఖ ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ మీడియాకు తెలిపారు. ‘ఇరాన్ దురాక్రమణలో భాగంగా జరిగిన ఈ దాడిలో మన భారత సోదరుడు మరణించడం అత్యంత బాధాకరం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నికల్ టీమ్స్, ఎమర్జెన్సీ క్రూ రంగంలోకి దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మతులు చేపడుతున్నాయి.
వందలాది క్షిపణులతో దాడులు
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్ రక్షణ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన నెల రోజుల్లో ఆ దేశంపై ఏకంగా 307 బాలిస్టిక్ క్షిపణులు, 2 క్రూయిజ్ క్షిపణులు, 616 డ్రోన్లతో దాడులు జరిగాయి. కేవలం గత 24 గంటల్లోనే 14 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లను కువైట్ సైన్యం అడ్డుకుంది. మరోవైపు ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీ గోడౌన్లతో పాటు ఒక సైనిక స్థావరంపై జరిగిన దాడిలో పది మంది సైనికులు గాయపడ్డారు.
‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’
యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో కువైట్ ప్రభుత్వం తమ పౌరులను, విదేశీ కార్మికులను అప్రమత్తంగా ఉండాలని కోరింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా దళాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ


