మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. మన లక్ష్యం దృఢంగా ఉండాలి. ఎంతలా పరిస్థితులు కుంగదీస్తున్నా..మన ధ్యేయం గురితప్పకూడదు. కష్టమే కష్టపెట్టలేక విసిగిపోయేలా..గెలుపు తీరాలని అందుకుని స్ఫూర్తిగా నిలవాలి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అన్షుమాన్ రాజ్.
బిహార్‌కి చెందిన అన్షుమాన్ రాజ్ బాల్యం మొత్తం బక్సర్‌జిల్లా నవానగర్ బ్లాక్‌లో సాగింది. తండ్రి రైస్‌మిల్లు వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. దాంతో కనీసం ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేక ఇక్కట్లు పడుతుండేది. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన అతడి తల్లి ఒక్కరే కుటుంబానికి ఆధారంగా మారింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎంతో పట్టుదలతో చదువుకునేవాడు.
నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను ప్రారంభించి అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. మెట్రిక్యులేషన్ తర్వాత, అతను జవహర్‌లాల్ నవోదయ విద్యాలయంలో తన చదువును కొనసాగించి, 12వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధం కావాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు. అన్షుమాన్ తన అచంచలమైన పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాడు గానీ మెయిన్స్‌లో సక్సెస్ కాలేకపోయాడు.
ఆ ఎదురుదెబ్బకు నిరుత్సాహపడకుండా మరోసారి పయత్నించేందుకు ఢిల్లీకి మకాం మార్చాడు. రెండో ప్రయత్నంలో కూడా రాత పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాడు కానీ పర్సనాలిటీ టెస్ట్‌లో పాస్ కాలేకపోయాడు. దాంతో ముచ్చటగా మూడోసారి పరీక్ష రాశారు. ఆ ప్రయత్నంలో మొత్తం మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ ఐఏఎస్‌కు కాకుండా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పోస్ట్ పొందాడు.
కానీ అన్షుమాన్ తన డ్రీమ్‌ని వదులుకోవడానికి ఇష్టపడక.. మరోసారి అకుంఠిత దీక్షతో సివిల్స్‌కు సన్నద్ధమై 2019 నాల్గో ప్రయంత్నంలో తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. 107 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. అతడి కథ..అకస్మాత్తుగా వచ్చిపడే కష్టాలకు లక్ష్యాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదని తెలుపుతోంది. ఎన్ని కష్టాలు వెంటాడినా..వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తే..కచ్చితంగా ఏదో ఒకరోజు విజయం పాదాక్రాంతం అవుతుందని ఐఏఎస్ అన్షుమాన్ కథ చెప్పకనే చెబుతోంది కదూ..!.
(చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!)


