Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ | Politicians show up for black magic during elections | Sakshi
Sakshi News home page

Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ

Mar 30 2026 10:59 AM | Updated on Mar 30 2026 11:09 AM

Politicians show up for black magic during elections

గౌహతి: అక్కడ మండుటెండలో ఒక మహిళ స్పృహలేకుండా నేలపై పడి ఉంది. ఆమె తలపై ఒక చేటను ఉంచి, మంత్రాలు పఠిస్తూ నీళ్లు పోస్తున్నాడు ఒక వ్యక్తి. తరువాత అదే నీటిని ఒక మట్టి పాత్రలో పోసి ఆమె చేత తాగించాడు. ఇదేదో మారుమూల అడవిలో జరుగుతున్న తంతు కాదు.. అస్సాంలోని క్షుద్ర విద్యల రాజధానిగా పేరొందిన ‘మాయోంగ్’ గ్రామంలోని దృశ్యం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడ మంత్రతంత్రాల హోరు మరింతగా మారుమోగిపోతోంది

క్షుద్ర పూజల హడావుడి
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 9న జరగనున్నాయి.  ఈ నేపధ్యంలో పలువురు అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనితో పాటు, మంత్రతంత్రాలతో గెలుపును దక్కించుకోవాలని మాయోంగ్ బాట పడుతున్నారు. గౌహతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం మంత్రతంత్రాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వచ్చే నేతలు ఓట్లు అడగడానికి రారని, ‘విజయ ప్రాప్తి’ కోసం క్షుద్ర పూజలు చేయించుకునేందుకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం జాగీరోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుండి బీజేపీ తరపున మంత్రి పిజూష్ హజారికా, కాంగ్రెస్ నుండి బబుల్ దాస్ పోటీ పడుతున్నారు. పిజూష్ హజారికా పది రోజుల క్రితమే తన కుటుంబంతో కలిసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడు
మాయోంగ్‌లో సుమారు మూడు వేల జనాభా ఉంటే, దాదాపు ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడు ఉంటాడని చెబుతుంటారు. ఇక్కడి వారసత్వంగా వస్తున్న తంత్ర విద్యను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ‘మా వద్దకు జబ్బులు తగ్గించుకోవడానికి, మానసిక సమస్యల నివారణకు చాలామంది వస్తుంటారు. రాజకీయ నేతలు కూడా వస్తుంటారు. అయితే ఎవరినైనా ఓడించడానికైనా పూజలు చేయమంటే మేము ఒప్పుకోం. వచ్చే ప్రతి వ్యక్తి వివరాలను ఒక డైరీలో నమోదు చేస్తాం’ అని స్థానిక తంత్రవేత్త విపుల్ మేధి తెలిపారు. 100 ఏళ్ల వయసున్న జంతు మండల్ అనే వృద్ధ మంత్రగాడు మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి కూడా నేతలు వచ్చి మంత్రి పదవుల కోసం పూజలు చేయమని తమను అడుగుతారని, కానీ తాము కేవలం స్వస్థత చేకూర్చే పనులు మాత్రమే చేస్తామని పేర్కొన్నారు.

చరిత్రలో ‘మాయోంగ్’ మాయాజాలం
ఈ గ్రామానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. శత్రువులను గాలిలో మాయం చేయడం, మనుషులను జంతువులుగా మార్చడం వంటి శక్తులు ఇక్కడి వారికి ఉన్నాయని స్థానికుల నమ్మకం.
తుగ్లక్ సైన్యం మిస్టరీ: 1337లో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ తుగ్లక్ పంపిన ఒక లక్ష మంది సైన్యం ఈ మాయోంగ్ అడవుల్లోనే అదృశ్యమయ్యారనే కథలు ప్రచారంలో ఉన్నాయి.
మొఘలుల వెనకడుగు: ఔరంగజేబు పంపిన రాజా రామ్ సింగ్ కూడా మాయోంగ్ మంత్రగాళ్ల భయంతో వెనక్కి తగ్గినట్లు చరిత్ర చెబుతోంది.
మహాభారతంతో లింక్: భీముడు-హిడింబల కుమారుడైన ఘటోత్కచుడు ఇక్కడే నివసించాడని, అతని వారసులే ఈ విద్యల్లో ఆరితేరారని స్థానికులు నమ్మకం. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన పురాతన కత్తులు, మంత్రాలు రాసిన రాగి పలకలను స్థానిక మ్యూజియంలో భద్రపరిచారు.

మారుతున్న కాలం
ఇక్కడ 18వ శతాబ్దం వరకు నరబలి కూడా జరిగేదని, బ్రిటిష్ వారు దానిని నిషేధించారని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత తరం ఈ విద్యలకు దూరంగా ఉంటోంది. గ్రామంలోని యువత ఇప్పుడు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతోంది.‘మా పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయ నేతలు కూడా గెలిచాక మా పిల్లలకు ఉపాధి కల్పించాలి’ అని స్థానిక మహిళలు నిరుపమ దేవి, నీలం ముని దేవి  మీడియా ముందు కోరారు.

ఇది కూడా చదవండి: షాకింగ్‌: ఇండియా పోస్ట్ పేరుతో కొత్త దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement