పంపకాలు అప్పుడే తిప్పలు | - | Sakshi
Sakshi News home page

పంపకాలు అప్పుడే తిప్పలు

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

పంపకాలు అప్పుడే తిప్పలు

పంపకాలు అప్పుడే తిప్పలు

జీహెచ్‌ఎంసీ నుంచి సీఎంసీ, ఎంఎంసీకి నిధులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) నుంచి సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)లకు రూ.500 కోట్లు వాటి ఖాతాలకు జమ చేయనున్నారు. ఉమ్మడి జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిశాక మూడు కార్పొరేషన్‌ల ఏర్పాటు అనంతరం గురువారం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు కార్పొరేషన్లకూ స్పెషలాఫీసరైన జయేశ్‌రంజన్‌ వరుసగా సీఎంసీ, ఎంఎంసీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో రూ.500 కోట్ల వంతున రెండు కార్పొరేషన్లకు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా అవసరమైన పనులు, ఇతరత్రా నిర్మాణ పనులు చేసేందుకు ఈ నిర్ణయించారు.

పంపిణీకి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

అప్పులు, ఆస్తులు, సిబ్బంది పంపిణీకి సంబంధించి సీజీజీ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పెషల్‌ ఆఫీసర్‌ జయేశ్‌ రంజన్‌ తెలిపారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ.. అనుభజ్ఞులైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సిఫార్సులకనుగుణంగా అప్పులు, ఆస్తుల పంపినీకి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధ్యయనానికి దాదాపు పది రోజుల సమయం పడుతుందన్నారు. ప్రజల అవసరాలకనుగుణంగా కార్యాచరణ చేపట్టనున్నట్లు చెప్పారు.

ఆమోదించిన అంశాలు

రెండు కార్పొరేషన్లకు రూ. 500 కోట్ల వంతున కేటాయింపుతో పాటు కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పునర్వ్యవస్థీకరణ, సైబరాబాద్‌, మల్కాజిగిరి, గ్రేటర్‌ హైదరాబాద్‌గా మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల ఏర్పాటు, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో కొనసాగింపు, ప్రతి కార్పొరేషన్‌కు ప్రత్యేక కార్పొరేట్‌ హోదా, చట్టబద్ధ హక్కులు, సైబరాబాద్‌, మల్కాజిగిరి, కార్పొరేషన్లకు సిబ్బంది కేటాయింపు.

ఆకాంక్షలకనుగుణంగా..

టీ క్యూర్‌లోని మూడు కార్పొరేషన్లు ప్రజల ఆకాంక్షల కనుగుణంగా పనిచేయాలని స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో అధికారులను జయేశ్‌ రంజన్‌ ఆదేశించారు. ఆరు నెలల్లో సర్కిల్‌, వార్డు స్థాయిలో స్పష్టమైన మార్పులు కనిపించాలన్నారు. కార్పొరేషన్ల మధ్య పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

బల్దియాపై మొత్తం రూ.4,877 కోట్ల రుణభారం

సాక్షి, సిటీబ్యూరో: కొత్త కార్పొరేషన్లు అవతరించి కుదురుకోక ముందే నెత్తిన భారం పడనుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కు ఉన్న రూ.4,877 కోట్ల అప్పులను పరిధుల వారీగా పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగర శివార్లలోని 27 పట్టణ, స్థానిక సంస్థలను జీహెచ్‌ంఎసీలో విలీనం చేసిన తర్వాత హైదరాబాద్‌ మహానగరాన్ని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (సీఎంసీ), మల్కాజిగిరి నగరపాలక సంస్థ (ఎంఎంసీ) మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మహానగర పరిధి 2,054 చదరపు కిలోమీటర్లు (చ.కి.మీ.), 300 వార్డులకు విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించింది.

మౌలికం కోసం రుణాలు..

గ్రేటర్‌లో రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి కాలువల ప్రాజెక్ట్‌లు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల అవసరమయ్యాయి. వ్యూహాత్మక రహదారి అభివద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ), నీటి కాలువ ప్రాజెక్టులు ఇతర పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఎక్కువగా రుణాలను సమీకరించింది. ఇందుకోసం మున్సిపల్‌ బాండ్లు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీఐ), హడ్కో వంటి వివిధ మార్గాల ద్వారా రూ.4,877 కోట్ల రుణాలను తీసుకుంది. తాజాగా గ్రేటర్‌ మూడు నగరపాలక సంస్థలుగా విభజన జరగడంతో ఈ రుణ మొత్తాన్ని ఎవరు భరిస్తారనే ప్రశ్న తలెత్తింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులు జరిగిన ప్రాంతాన్ని బట్టి రుణ విభజన, చెల్లింపుల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. అప్పులతో పాటు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తులను కూడా సంబంధిత బల్దియాకే అప్పగించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

సమావేశంలో కర్ణన్‌, జయేశ్‌రంజన్‌

అప్పులు, ఆస్తుల పంపిణీకి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

స్పెషల్‌ ఆఫీసర్‌ జయేశ్‌రంజన్‌ స్పష్టీకరణ

మూడు కార్పొరేషన్ల స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు

మూడు కార్పొరేషన్ల మధ్య అప్పుల విభజన

అభివృద్ధి పనుల ప్రాంతాన్ని బట్టి పంపకాలు

విధాన ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

శానిటేషన్‌, వెటర్నరీ విభాగాల్లో ఉద్యోగుల కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement