సాక్షి, హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 సందర్భంగా.. రేపు అర్ధరాత్రి 12 దాకా మద్యం అమ్మకాల నిర్వహణకు వైన్స్ దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. అలాగే.. బార్లు, క్లబ్‌లతో పాటుగా ఈవెంట్లు నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నవారికి అర్ధరాత్రి 1.గం. దాకా మద్యం అమ్మకానికి అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు ఇదివరకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడంతో పాటు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నేతృత్వంలో ఇవాళ, రేపు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనుంది.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల పాత ఏడాదికి వీడ్కోలు.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఈవెంట్లు సిద్దమైయాయి.ఈ క్రమంలో రాజధాని శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. ఈఏడాది కూడా కోట్ల రూపాయల దందా సాగుతుందని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అంచనా వేస్తుంది. అయితే.. ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేయకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తగిన ఏర్పాటు చేస్తోంది.
మరోవైపు.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల శాఖ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. రోడ్లపై ద్విచక్ర వాహనాలతో హంగామా చేస్తే కేసు నమోదు తప్పదని పేర్కొంది.


