టచ్‌ అండ్‌ గో.. ఈజీ జర్నీ! | - | Sakshi
Sakshi News home page

టచ్‌ అండ్‌ గో.. ఈజీ జర్నీ!

Dec 30 2025 11:29 AM | Updated on Dec 30 2025 11:29 AM

టచ్‌ అండ్‌ గో.. ఈజీ జర్నీ!

టచ్‌ అండ్‌ గో.. ఈజీ జర్నీ!

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ప్రయాణ సౌకర్యాలను విస్తృతపర్చడం, నాణ్యంగా, సత్వరంగా అందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(హుమ్టా) కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ దిశగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న ఎంఎంటీఎస్‌, సిటీబస్‌, మెట్రో సేవలను సమన్వయం చేస్తూ సమగ్ర రవాణా సదుపాయాలను కల్పించేందుకు హెచ్‌ఎండీఏ అనుబంధ హుమ్టా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే, మెట్రో అధికారులతో ఇటీవల బస్‌భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ మూడు సంస్థల అధికారులు పాల్గొని పలు సూచనలు అందజేశారు. ఈ మేరకు హుమ్టా ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. మలక్‌పేట్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ నుంచి మలక్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ వరకు ప్రయాణికులు తేలిగ్గా రాకపోకలు సాగించేందుకు దక్షిణ మధ్య రైల్వే స్కైవాక్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇదే తరహాలో మరిన్ని చోట్ల ఎంఎంటీఎస్‌, మెట్రోస్టేషన్ల మధ్య స్కైవాక్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రయాణికులకు సీమ్‌లెస్‌ జర్నీ సదుపాయం అందుబాటులోకి రావడమే కాకుండా మెట్రో నుంచి ఎంఎంటీఎస్‌కు తేలిగ్గా మారేందుకు అవకాశం లభిస్తుంది. అధికారులు అవసరమైన చోట సిటీ బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు.

టచ్‌ అండ్‌ గో ఇలా...

● నగరంలో 51 ఎంఎంటీఎస్‌ స్టేషన్లు ఉన్నాయి. ప్రతిరోజు 88 సర్వీసులు నడుస్తున్నాయి. కానీ, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ మేరకు అవి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిచేవి. సుమారు 1.4 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు బాగా తగ్గారు. రోజుకు 60 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ సర్వీసులతోపాటు ప్రయాణికుల సంఖ్యను కూడా పెంచేందుకు హుమ్టా ప్రణాళికలు సిద్ధం చేసింది.

● 51 ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో 29 స్టేషన్లకు మాత్రమే సిటీ బస్సుల సదుపాయం ఉంది. అయితే ఈ స్టేషన్లు బస్టాపు నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయి.

● మరో 13 స్టేషన్లు మాత్రం బస్టాపు నుంచి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ నుంచి బస్టాప్‌ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.

● రెండు కిలోమీటర్ల దూరానికి ఆటోవాలాలు కనీసం రూ.50 పైనే వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ నుంచి సిటీబస్సుకు మారేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

● ఈ రూట్లలో సిటీ బస్సులను ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ మీదుగా నడిపితే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు రకాల రవాణా సదుపాయాలను సద్వినియోగం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

● హైటెక్‌సిటీ, చందానగర్‌, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌, లింగంపల్లి, ఉందానగర్‌, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు, ఫలక్‌నుమా, యాకుత్‌పురా, గౌడవెల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, కూచవరం స్టేషన్లకు సిటీబస్సులతో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి.

● ఇప్పటికే సిటీ బస్సులకు అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు ట్రిప్పులను పెంచాలి.

స్కైవాక్‌తో అనుసంధానం...

● మిగతా ఎంఎంటీఎస్‌ స్టేషన్ల నుంచి సమీపంలోని మెట్రోస్టేషన్లకు రాకపోకలు సాగించేందుకు వీలుగా స్కైవాక్‌లను ఏర్పాటు చేయాలి. మలక్‌పేట్‌ స్టేషన్‌ పునరాభివృద్ధిలో భాగంగా రైల్వే అధికారులు స్కైవాక్‌ నిర్మాణం చేపట్టారు.

● నాంపల్లి స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి మెట్రో వరకు స్కైవాక్‌ అందుబాటులోకి రానుంది.

● సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఈస్ట్‌, వెస్ట్‌ సికింద్రాబాద్‌ మెట్రో స్టేషన్లు, రేతిఫైల్‌, గురుద్వారా బస్టాపులను కలుపుతూ స్కైవాక్‌ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది.

● కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి నారాయణగూడ మెట్రోకు స్కైవాక్‌తో అనుసంధానం చేయాలి.

● లక్డీకాపూల్‌, బేగంపేట్‌, భరత్‌నగర్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు కూడా మెట్రో స్టేషన్లను అనుసంధానం చేయాలని అధికారులు సూచించారు.

ఎంఎంటీఎస్‌– సిటీబస్‌, మెట్రోల మధ్య కనెక్టివిటీకి చర్యలు

మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్నచోట స్కైవాక్‌లు

సమగ్ర రవాణా అభివృద్ధికి హుమ్టా ప్రత్యేక కార్యాచరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement