రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి పాత్ర ఏమిటో జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేసింది
మా పనితీరు, ప్రతిపక్షాల వ్యవహారశైలి గమనించి ప్రజలు విస్పష్ట తీర్పునిచ్చారు
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు ఆశీర్వదించారు
కేటీఆర్, హరీశ్‌రావు మారాలి.. క్రియాశీలకంగా లేని కేసీఆర్‌పై విమర్శలు సరికాదు
కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల విషయంలో కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు
ఇక అభివృద్ధిపై దృష్టి పెడతాం.. హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం
17న కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యతలేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేల్చేసిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ రెండేళ్ల పనితీరు, ప్రతిపక్షాల వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించిన ప్రజలు.. ఎవరు ఏ పాత్ర పోషించాలో, ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలో స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం, హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళిక, బీఆర్‌ఎస్..బీజేపీల వ్యవహారశైలి, ఎమ్మెల్యేల అనర్హత, స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం మాట్లాడారు.
51% ఓట్లతో విలక్షణ తీర్పు
‘మేము ప్రభుత్వంలోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలిచ్చిన తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది. ఈ గెలుపును బాధ్యతగా స్వీకరిస్తామే తప్ప.. గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ఈ ఎన్నికలో మాకు 51 శాతం ఓట్లు వేయడం ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. రెండేళ్ల మా పనితీరును గమనించి ఓ నిర్ణయానికి వచ్చి ఇచ్చిన తీర్పు ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి పాత్ర ఏంటో ప్రజలు స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడం, మౌలిక వసతులు కల్పించడం, ఉద్యోగ, ఉపాధి ప్రణాళికలు రూపొందించడం కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తర ణ, నగరానికి కృష్ణా, గోదావరి జలాలు, ట్రాఫిక్ సమస్య, ఎలివేటెడ్ కారిడార్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, చెరువులు,నాలాల కబ్జాల నియంత్రణ లాంటి కార్యక్రమాలతో హైదరాబాద్‌ను అన్నివిధాలా తీర్చిదిద్దుతాం..’అని రేవంత్ చెప్పారు.
కేటీఆర్ అహంకారం,హరీశ్ అసూయ తగ్గించుకోవాలి
‘బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేసింది. పెయిడ్ ఆర్టికల్స్, ఫేక్ సర్వేలతో అవహేళన చేసి అవమానించి అసభ్యకర భాషలో మమ్మల్ని దూషించారు. హరీశ్‌రావు అసూయను తగ్గించుకోవాలి. కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలి. వయసులో నా కంటే చిన్నవాడైన కేటీఆర్ ఇంకా చాలా కాలం రాజకీయాల్లో ఉండాల్సి ఉంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వారసత్వ సంపద కాదు. ప్రతిపక్షం ఇప్పటికైనా సంయమనం పాటించాలి. కానీ ఇప్పుడు కూడా కేటీఆర్ తన మాటలను మార్చుకోవడం లేదు.
హరీశ్‌రావు అసూయ తగ్గించుకుంటే మంచిది. ఆయన అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మా వైపు తీక్షణంగా చూస్తాడు. ఆయన చూపులకే గనుక శక్తి ఉంటే మా వైపు కూర్చున్న వాళ్లంతా మాడి మసై పోతారేమోనని అనిపిస్తుంది. ఈ ఇద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికలకు ఇంకో మూడేళ్ల సమయముంది. చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం. మరో రెండేళ్లు రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. మంచి సూచనలు చేయండి.. చర్చించండి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఇప్పటికైనా హైదరాబాద్‌ను మంచి నగరంగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి సహకరించండి..’అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రమే..
‘కేసీఆర్‌ను ఆ కుర్చీ నుంచి తప్పించాలని హరీశ్‌రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ ఓసారి వాళ్లకు కూడా అవకాశమిస్తే అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రచారానికి రానట్టున్నారు. అయినా ఆయన అంత క్రియాశీలకంగా లేరు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా లేనప్పుడు విమర్శించడం భావ్యం కాదు..’అని సీఎం వ్యాఖ్యానించారు.
నిధులు ఇవ్వనందుకే బీజేపీకి ఈ దుస్థితి
‘ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ పెడతాం. ఆదాయం పెంచుకుంటాం. వనరులు సమకూర్చుకుంటాం. కేంద్రం నుంచి తేవాల్సిన అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన చేపడితే ప్రతి నిమిషం అడ్డు తగిలారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, గోదావరి జలాలు, ట్రిపుల్ ఆర్ లాంటి వాటికి వీలున్నంత మేర అడ్డు తగులుతున్నారు. దీన్ని గమనించిన జూబ్లీహిల్స్ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో 65 వేల ఓట్లు వచ్చిన బీజేపీకి..ఇప్పుడు 17 వేల ఓట్లు మాత్రమే వేశారు.
కిషన్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో 25 శాతం ఓట్లే ఇప్పుడు వచ్చాయి. ఆ పార్టీ డిపాజిట్ జప్తయింది. ఇది భూకంపం వచ్చే ముందు కనిపించే చిన్న ప్రకంపన లాంటిది. దీన్ని గమనించి ఇప్పటికైనా వ్యవహారశైలి మార్చుకోకపోతే ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తేనందుకే బీజేపీకి ఈ పరిస్థితి దాపురించింది. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న పనుల గురించి, అనుమతుల గురించి చర్చించేందుకు కిషన్‌రెడ్డి సచివాలయానికి రావాలి..’అని రేవంత్ అన్నారు.
బిహార్ ఎన్నికలపై సమీక్ష జరపలేదు
‘బిహార్ ఎన్నికల గురించి ఇంకా సమీక్షించలేదు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధిష్టానం ఇస్తుంది కనుకనే ఇక్కడ ఎంఐఎంతో కలిసి పనిచేశాం. ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్, సుప్రీంకోర్టు చేతిలో ఉంది. స్థానిక ఎన్నికల గురించి ఈ నెల 17వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చిస్తాం. న్యాయస్థానంలో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రులందరి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం.’అని సీఎం చెప్పారు.
అందరితో కలిసి ముందుకెళ్తాం..
‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5 శాతం ఓట్లు వచ్చాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 41 శాతం వస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓట్లు 51 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపై నిలబడి పని చేస్తే ఎవరూ ఓడించలేరని మరోమారు రుజువయింది. బూత్ అధ్యక్షుడి నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు, వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు అందరూ కలిసి పనిచేశారు. మాకు మద్దతిచ్చిన ఓటర్లకు, మీడియాకు, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లకు, ఇతర సంఘాలకు కృతజ్ఞతలు.
అందరితో కలిసి ముందుకెళ్తాం. మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. అభినందనలు..’అని రేవంత్ అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి, సీతక్క, జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నగర కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


