సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలో గెలిచిన వల్లాల నవీన్ యాదవ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌నూ ఆయన అభినందించారు.
శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగుర వేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.
కాంగ్రెస్ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు.


