
సాక్షి, హైదరాబాద్: అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే.. ఇక్కడి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణాకు ప్రమాదంగా మారబోతోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్‌కు ఇరువై రోజుల క్రితం లేఖ రాశారు. సీడబ్యూసీ(CWC) నిబంధనల ప్రకారం నికర జలాల మీదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వరద జలాలపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఇస్తారు?..
రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా ? సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా ?. 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. పైన కృష్ణా, కింద గోదావరి జలాలు పోతే తెలంగాణ పరిస్థితి రెంటికి చెడిన రేవడిగా మారుతుంది. ఫ్లడ్ వాటర్ తో ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకుంటే తాము కూడా ప్రాజెక్ట్ కట్టుకుంటామని మహారాష్ట్ర అంటోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది.
పోలవరం రైట్ కెనాల్ ద్వారా 11 వేల 500 క్యూసెక్కుల కెపాసిటీ కేంద్రం అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 23 వేల క్యూసెక్కుల కెపాసిటీతో కాలువలకు ఎలా టెండర్లు పిలిచారు ?. కాలువలు తవ్విన టీడీపీ ది తప్పు అయితే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు కనీస బాధ్యత లేదా ?. అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే కేంద్ర మంత్రులు ఎందుకు పెదవులు మూసుకుంటారా?.
చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతోంది. బీజేపీ తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో రకంగా వ్యవహరిస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు?. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు
కేంద్ర మంత్రి లేఖ రాసి ఇరువై రోజులు అయ్యింది.. కర్ణాటక లేఖ రాసి రెండు వారాలు అవుతుంది. ఇంకోవైపు మహారాష్ట్ర మరోవైపు లేఖ రాసింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. వరద జలాలే కాదు.. నికర జలాలు పోయేటట్లు ఉన్నాయి. వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎలా కడతారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?. కేంద్ర మంత్రి, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు అబద్దమా?. ఢిల్లీ వెళ్లి ఎందుకు రేవంత్ కొట్లాడడం లేదు?. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. కృష్ణా జలాలు ఆపుతామని అంటే పిల్లిలా మారారా?.
ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఖర్గే, సిద్దరామయ్యతో ఎందుకు మాట్లాడం లేదు?. కనీసం రాహుల్ గాంధీతో ఫోన్ కూడా చేయించలేకపోతున్నారా?.రేవంత్ రెడ్డి బ్యాగులు మోయడమే కాదు తెలంగాణ బాగోగులు కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని హరీష్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ఆ కండిషన్‌తో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చట!