
‘స్థానిక’ పోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచన
ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 9, 41, 42 నిలిపివేత
సర్కార్ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలులేదు
పూర్తి స్థాయిలో మెరిట్స్‌లోకి ఇప్పుడే వెళ్లడం లేదన్న న్యాయస్థానం
పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా పేర్కొని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచన
శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ విడుదల
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని హైకోర్టు సీజే ధర్మాసనం నిలిపివేసింది. దీంతో పాటు మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు సంబంధించి పంచాయతీ రాజ్ చట్టం–2018లో రిజర్వేషన్లను మారుస్తూ సెపె్టంబర్ 26న జారీ చేసిన జీవో నంబర్ 41, 42పై కూడా స్టే విధించింది. ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని తెలిపింది.
వికాస్ కిషన్‌రావ్ గవాలీ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని నిర్దేశించిందని, దీన్ని పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ ఇచ్చిన జీవోలను ఈ కోర్టు నిలిపివేసినందున, రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచిన 17 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి తీర్పు కాపీని విడుదల చేసింది.
ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయండి..
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దన్న వాదనలు తమ ముందుకు వచ్చాయని.. వాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నందున.. గతంలో రాహుల్ రమేశ్‌వాఘ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడుతున్నామని చెప్పింది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ట్రిపుల్ టెస్ట్‌ను పాటించపోతే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి లేకుండా, పెంచిన దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని, స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఈ కోర్టు భావించడం లేదని చెప్పింది. రిజర్వేషన్ల పెంపు జీవోను నిలిపివేసినందున ఆ మేరకు మార్పు మాత్రమే సూచిస్తున్నామని స్పష్టం చేసింది.
కింకర్తవ్యం..!?
⇒ జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు
⇒ న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సంప్రదింపులు
⇒ అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు..రాజుకుంటున్న రాజకీయ వేడి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42% కోటా జీవోపై హైకోర్టు స్టే విధించడంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అసలు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేదా? జరిగితే ఎప్పుడు, ఎలా జరుగుతాయి? ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నది అసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందు కెళ్లాలనేదానిపై ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు అటు రాజకీయ వర్గాలు, ఇటు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు తీర్పు దరిమిలా ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే ఈ అంశంపై పకడ్బందీగా ముందుకు వెళ్లడంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేది కూడా శుక్రవారం అర్ధరాత్రికి స్పష్టత రావడంతో, ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నారు.
రెండే ప్రత్యామ్నాయాలు?
రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకటి కాగా.. జీవో అమలుపై స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు సూచనలకు అనుగుణంగా ఆరు వారాల పాటు వేచి ఉండటం రెండో ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఆ సమయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు పంపిన బిల్లులకు కూడా మూడు నెలల సమయం పూర్తవుతుందని, అప్పుడు అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ల జీవోకు అనుకూల నిర్ణయాన్ని కోర్టుల నుంచి ఆశించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు.
ప్రతిపక్షాలకు అస్త్రంగా..
హైకోర్టు స్టే నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో ఇరుకున పెట్టే వ్యూహంతో ప్రతిపక్ష పారీ్టలు ముందుకెళుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుదల అంశం న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ప్రధాన రాజకీయ పారీ్టల నేతలు విమర్శిస్తున్నారు. హైకోర్టు స్టే విధించడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిదేనని ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు.
రిజర్వేషన్ల అంశం రాజ్యాంగపరమైన, శాస్త్రీయమైన ప్రక్రియతోనే సాధ్యమని తెలిసీ, కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా అపహాస్యం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు.. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పారీ్ట.. వీరి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.
తమకు చిత్తశుద్ధి లేకపోతే అసలు ఇంత దూరం ఎందుకు తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో మద్దతిచ్చిన బీఆర్‌ఎస్ కోర్టు కేసులో ఇంప్లీడ్ కాకపోవడాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌ల వద్ద ఉన్న బిల్లులను ఆమోదింపజేస్తే అసలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరమే రాదని, ఈ విషయంలో బీజేపీ నేతలు బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద హైకోర్టు స్టే రాష్ట్రంలో రాజకీయ వేడిని రగులుస్తుండగా.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.