
మీనాక్షి, భట్టి, మహేశ్‌కుమార్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
మంత్రివర్గంలోనే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపణ
తనకు చెప్పకుండా ఓఎస్‌డీ తొలగింపు అవమానకరమని వాదన
పార్టీ పెద్దలే సెట్ చేస్తామన్నారు: సురేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణా మాలు కలకలం రేపాయి. కొంతకాలంగా నెల కొన్న వివాదం గురువారం రాత్రి వరకు కొన సాగింది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకెక్కకుండా పార్టీ పెద్దలు అతికష్టం మీద నియంత్రించగలి గారు. తనను లక్ష్యగా చేసుకొని పార్టీలో, మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న మంత్రి సురేఖ గురు వారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశ మై తన వాదన వినిపించారు.
అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో కూడా చర్చించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్‌డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి తెలిపినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు.
పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యం: కొండా
మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తాజా పరిణామాలపై పార్టీ ఇన్‌చార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌మార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినం. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా మని చెప్పారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉంది’అని పేర్కొన్నారు.

నివురుగప్పిన నిప్పులా పరిస్థితి..
వరంగల్‌లో మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తరువాత సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ను తొలగించడంతో వివాదం ముదిరింది. మేడారం అభివృద్ధి పనులను దేవా దాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదలాయించడంతో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంత్రి కుమార్తె సుష్మిత.. సీఎం పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఓ వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టించాయి.