
మెదక్ అర్బన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం నేనే ఎమ్మెల్యే. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై నమ్మకం ఉంది. పార్టీ టికెట్ ఎలాగైనా ఇస్తారు. అమ్మవారి దయతో 2029 ఎన్నికల్లో నిజాంపేట బిడ్డగా.. ఎమ్మెల్యేగా మీ ముందుకొస్తానంటూ..’ నిజాంపేటలో ఆదివారం జరిగిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పంపిణీ కార్యక్రమంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో కాక రేపుతున్నాయి. మెతుకుసీమ రాజకీయాల్లో ఉద్యమ నేతగా పేరొందిన పద్మక్క.. ద్వితీయ శ్రేణి నాయకుడి ధిక్కార స్వరంతో కలవరపడుతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పు లా ఉన్న ఆశలు.. ఒక్కసారిగా భగ్గుమనడంతో బీ ఆర్‌ఎస్‌లో అలజడి మొదలైంది. అయితే ఈ వ్యా ఖ్యల పరిణామాలను ట్రబుల్ షూటర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పుడు నెయ్యం.. ఇప్పుడు కయ్యం
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి మైనంపల్లి రోహిత్‌రావు రూపంలో పార్టీ షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకులోనైన కంఠారెడ్డి డీసీసీ పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. మోసం చేసిన కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో హస్తం పార్టీలో ఉన్న తనవర్గాన్ని బీఆర్‌ఎస్‌లోకి తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. కొంతమేర కృతకృత్యుడయ్యాడు.
అప్పట్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి విజయం కోసం కృషి చేశారు. కాలం గడుస్తున్నా కొద్ది బీఆర్‌ఎస్‌లో కొంతమందిని తన వైపు తిప్పుకున్నాడు. విందులు, వినోదాలతో మరికొంత మందిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే కొంతకాలం నియో జకవర్గానికి దూరంగా ఉన్న సమయాన్ని వినియోగించుకొని కొంతమేర పట్టు పెంచుకున్నాడు. ఆర్థిక సహాయాలు, ప్రజోపయోగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో పరపతిని పెంచుకున్నాడు.
ముందుగానే పసిగట్టిన పద్మారెడ్డి
మెతుకుసీమ రాజకీయాల్లో ఎదురులేని ఏలికగా నిలిచిన బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి, పార్టీలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసి గట్టారు. ఎమ్మెల్యే పదవిపై ఆశలు పెంచుకుంటున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కదలికలపై కన్నేసి, కౌంటర్ చర్యలు ప్రారంభించారు. పైకి సఖ్యతగా ఉన్నట్లు కనిపించినా, కంఠారెడ్డితో కలిసి ఉన్న సందర్భాల్లో పద్మారెడ్డి అసౌకర్యంగానే ఉన్నట్లు కనిపించేవారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతిరెడ్డి తన స్వస్థలమైన నిజాంపేటలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలను ప్రస్పుటం చేసేవిగా ఉండటంతో.. రెండు, మూడు రోజుల్లో మాజీ మంత్రి బీఆర్‌ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించి, సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పాపన్నపేటకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్యనాయకుడు ఒకరు తెలిపారు.
గులాబీ దళంలో పెరిగిన కంఠ స్వరం
మెతుకుసీమ బీఆర్‌ఎస్‌లోవర్గపోరు కొనసాగుతోంది. తాజాగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వ్యాఖ్యలతో అలజడి మొదలైంది. ఈ పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నట్లుతెలుస్తోంది.